Liquor culture in Telangana: ఈ మధ్యకాలంలో.. సందర్భం ఏదైనా సరే మద్యం తాగాల్సిందే అన్నట్టుగా ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మిగతా రాష్ట్రాలతో.. పోల్చుకుంటే తెలంగాణలో ఈ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మద్యం సేవిస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు సమాచారం.
డిసెంబర్ ఒకటి నుంచి 31 వరకు.. రూ.3,805 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ముఖ్యంగా డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరగగా.. డిసెంబర్ చివరి వారంలోనే దాదాపు రూ.1700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు స్పష్టం చేశారు. ఇకపోతే న్యూ ఇయర్ వేడుకలలో మందుబాబులు మద్యాన్ని మంచినీళ్ల లాగా తాగేశారు అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల్లోనే 684 కోట్ల రూపాయలు మద్యం ద్వారా లభించినట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖకు కొత్త సంవత్సరం రావడంతో ఆదాయం కూడా భారీగా పెరిగింది. డిసెంబర్ 30 2024న రూ.402 కోట్లు రాగా.. డిసెంబర్ 31 2024న రూ.282 కోట్లు లభించినట్లు సమాచారం. ఒక్క డిసెంబర్లోనే పార్టీలు, సమావేశాల వల్ల ఈ శాఖకు భారీగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది డిసెంబర్ 30వ తేదీ నాటికి 382,365 మద్యం కేసులు విక్రయించగా, 3,96, 114 బీర్ కేసులు అమ్ముడయ్యాయి.
దాదాపు 287 ఈవెంట్ల ద్వారా ఎక్సైజ్ శాఖ రూ.56.47 లక్షలు ఆర్జించింది. కొత్త సంవత్సరం వేడుకల కోసం మొత్తం 287 ఈవెంట్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి అందివ్వడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో 243 ఈవెంట్లకు అనుమతి ఇవ్వగా ,మిగతా జిల్లాలలో 44 ఈవెంట్లకు అనుమతులు లభించాయి. అలాగే 2023లో డిపార్ట్మెంట్ 224 ఈవెంట్లకు అనుమతులు ఇచ్చి, రూ .44.76 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది.
ఇకపోతే డిసెంబర్ 31 తెల్లవారుజామున మద్యంతోపాటు గంజాయి కూడా తీసుకున్నట్లు సమాచారం రావడంతో రైడ్ నిర్వహించగా నాలుగు కేసులు నమోదైనట్లు సమాచారం. అలాగే 313 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోగా, డ్రగ్స్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా పట్టుబడ్డారు.