Beer Price Hike Up to 15 Percent In Telangana: తెలంగాణ ప్రజలపై ప్రభుత్వం భారీ పిడుగు వేసిన విషయం తెలిసిందే. బీర్ల ధరలు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏ బీర్ ధర ఎంత పెరిగిందో తెలుసా?
బీర్ల ధరలు పెంచాలని ఒత్తిడి చేస్తున్న బీర్ తయారీ కంపెనీలకు ప్రభుత్వం తలొగ్గింది. బీర్ల ధరలు భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.
బీర్ల ధరల పెంపుపై రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ బీర్ల సరఫరాదారులకు 15 శాతం ధరల పెంపును సిఫారసు చేసింది. దాని ప్రకారం బీర్ల ధరలు ఎంత మోతాదులో పెరిగాయో తెలుసుకుందాం.
కేఎఫ్ స్ట్రాంగ్ బీరు ధర రూ.160 నుంచి 184కు పెరిగింది. ఇక అత్యధికంగా బీరు ప్రియులు తాగే కేఎఫ్ లైట్ బీరు రూ.150 నుంచి రూ.172కు పెరగడంతో బీరు ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
అల్ట్రా మ్యాక్స్ బీరు రూ.200 నుంచి రూ.253కు పెరగ్గా.. అత్యధికంగా అమ్ముడయ్యే బడ్వైజర్ లైట్ రూ.210 నుంచి రూ.241కు పెరిగింది. మ్యాగ్నమ్ బీరు సీసా రూ.220 నుంచి రూ.253కు ప్రభుత్వం పెంచింది.
టుబర్గ్ స్ట్రాంగ్ బీరు రూ.240 నుంచి రూ.276కు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన బీర్ల ధరలు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుతో బీరు ప్రియులపై కొంత భారం పడింది.
గతంలో బీర్ల కంపెనీల ఒత్తిడికి తలొగ్గనని గొప్పగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు ధరలు పెంచడం అందరినీ విస్మయానికి గురి చేసింది. బీర్ల ధరల పెంపుతో ప్రభుత్వానికి రూ.700 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా బీర్ల ధరల పెంపుపై బీఆర్ఎస్ పార్టీతో సహా ఇతర ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.