ఏంటీ .. బెంబేలెత్తిపోయారా! అవును అక్కడ టమాటో కిలో అక్షరాలా 300 రూపాయలు. అయితే ఈ రేటు మన దేశంలో కాదు.. పక్క దేశం పాకిస్థాన్ లో. పాకిస్థాన్ కు చెందిన డాన్ న్యూస్ పేపర్లో ఈ కథనం ప్రచురితమైంది. సాధారణ పౌరుడు మిన్నంటిన టమాటా ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నాడు. రాజకీయ నాయకులు భారత్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. యుద్ధం వస్తే సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. అంతేకానీ అక్కడి నుంచి ఎటువంటి దిగుమతులను చేసుకోం అంటున్నారు. మీకు ప్రజల గోడు పట్టదా.. ! అని అభిప్రాయాన్ని వెల్లడించింది.
పాకిస్తాన్లోని లాహోర్, ఇతర నగరాల్లో టమాటా కిలో రూ.300 పలుకుతుండటం అక్కడి ప్రజలకు మింగుడుపడటంలేదు. దీనిపై స్పందించిన పాకిస్థాన్ మంత్రి 'మన రైతులు ఉండగా.. విదేశీ రైతులకు ప్రోత్సహించడం దేనికీ' అని మా గొప్పగా సెలవిచ్చారట. భారత్ నుంచి మళ్లీ దిగుమతులు కొనసాగించేలా ఏవో దుష్టశక్తులు కుట్ర పన్నుతున్నాయని అన్నారు.
ఓ సారి మంత్రిగారి తలపై లారీడు టమాటాలను గుమ్మరిస్తే విషయం ఏంటో బోధపడుతుంది అంటూ పత్రికలో రచయిత వ్యాఖ్యానించారు. జాతీయత పేరుతో పౌరుల కడుపు కాల్చడం ఎంతవరకు సబబని ఈ కథనం ప్రశ్నించింది. లాహోర్లో కిలో రూ.300 పలుకుతున్న టమాటో.. అక్కడి నుంచి 30 మైళ్ల దూరంలో ఉన్న అమృతసర్లో రూ.40కే దొరుకుతుందని చెప్పారు. రాజకీయ నాయకులు ఇప్పటికైనా మేల్కొని ప్రజల అవసరాలను తీర్చాలని హితవు పలికింది.