జీ7 సదస్సుపై వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ఉత్పత్తులపై భారత్ లో భారీ టారిఫ్ లు వసూలు చేస్తున్నారు. ఈ విధమైన టారిఫ్ లు ఆగిపోవాలి...లేదంటే భారత్ తో వాణిజ్యాన్ని మేం ఆపేయాల్సి ఉంటుందని హెచ్చరిక ధోరణిలోమాట్లాడారు.
అమెరికా ఎగుమతులకు టారిఫ్ లు వివిధ దేశాలు ఏ విధంగా అడ్డుపడుతున్నాయనే అంశంపై ట్రంప్ మాట్లాడుతూ భారత్ ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో అధిక టారిఫ్ ల విషయమై భారత్ తీరును తప్పుబట్టిన ట్రంప్..ఇప్పుడు తన స్వరాన్ని పెంచుతూ హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు.
ఇదిలా ఉండగా ట్రంప్ వ్యాఖ్యలతో భారత్ - అమెరికా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినేలా ఉన్నాయని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. ఒక వేళ ట్రంప్ చెప్పినట్లు అమెరికా తన ఉత్పత్తులను నిలిపివేస్తే అది భారత్ కంటే అమెరికా దేశానికే ఎక్కువ నష్టమని పేర్కొన్నారు. ఎందుకంటే అమెరికా ఉత్పత్తులకు భారత్ అతి పెద్ద మార్కెట్ గా చలామణి అవుతోందని వెల్లడించారు.