Kidneys Theft In Bihar: ఊరుకుంటే.. వీడు కిడ్నీలు కూడా ఇడ్లీల్లా అమ్మేసే రకం.. మోస్ట్ నొటోరియస్ క్రిమినల్ గురించి చెప్పేటప్పుడు వాడి నేరచరిత్ర గురించి ఉదాహరణకు చెప్పుకునే సింగిల్ లైన్ డైలాగ్ ఇది. కానీ ఇది ఉదాహరణకు ఉపయోగించే ఉత్తి డైలాగ్ మాత్రమే కాదు.. అక్షరాల నిజం అని నిరూపించింది ఓ బీహార్ ముఠా. ఈ కిడ్నీల చోరీ బ్యాచ్‌కు పవన్ కుమార్, ఆర్కే సింగ్ అనే ఇద్దరు లీడర్స్‌గా వ్యవహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రస్తుతం నిందింతుల కోసం గాలిస్తున్నారు. వీరిలో పవన్ కుమార్ బాధితురాలికి సర్జరీ చేసిన నర్సింగ్ హోమ్ యజమాని కాగా.. రెండో వ్యక్తి ఆర్కే సింగ్ ఆమెకు సర్జరీ చేసిన వైద్యుడు.
కిడ్నీలు దోచుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 3న ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన సునితా దేవి అనే మహిళ గర్భాశయం తొలగించుకునేందుకని బరియర్‌పూర్ ప్రాంతంలోని శుభ్‌కాంత్ క్లినిక్ అనే ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కి వెళ్లింది. అక్కడ ఆమెకు సర్జరీ చేసిన వైద్యులు ఏమీ ఎరుగనట్టే ఇంటికి పంపించారు. కానీ ఇంటికొచ్చాకా సెప్టెంబర్7 భరించలేని కడుపు నొప్పి రావడంతో సునితా దేవి ఈసారి శ్రీకృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. పక్కలో బాంబు వేసినట్టుగా ఈ భయంకరమైన బ్యాడ్ న్యూస్ చెప్పారు. నీ రెండు కిడ్నీలు లేవని.. అందువల్లే ఈ నొప్పి అని చెప్పారు.
డాక్టర్లు చెప్పిన మాటలు విన్న సునితా దేవికి నోట మాట రాలేదు. కాళ్ల కింద భూమి కంపించినట్టు అయింది. గర్భాశయం తొలగించమని వెళ్తే.. ఏకంగా కిడ్నీలే తీసేశారా అని షాకైంది. పొరపాటున గర్భాశయం అనుకుని కిడ్నీలు తొలగించారా లేక దురుద్దేశపూర్వకంగానే కిడ్నీలు దోచుకున్నారా ? ఇలా రకరకాల అనుమానాలు ఆమెతో పాటు ఆమెను పరీక్షించిన వైద్యులను వేధించాయి.
అక్కడి నుంచి మరింత మెరుగైన వైద్య సహాయం కోసం బీహార్ ప్రభుత్వ ఆస్పత్రి అయిన ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేరారు. ప్రస్తుతం బాధితురాలు డయాలసిస్‌పై చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని.. ఆమె ఆరోగ్యం బాగుపడితేనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సాధ్యపడుతుందని నెఫ్రాలజీ విభాగం, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ విభాగం అధిపతి డా ఓం కుమార్ తెలిపారు.
ఇదే విషయమై ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి యురాలజీ విభాగం హెడ్ డాక్టర్ రాజేష్ తివారి మాట్లాడుతూ.. ప్రస్తుతం సునితా దేవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున ఇంకొన్ని వైద్య పరీక్షలు చేయలేకపోతున్నామని.. ఆమెలోని రెండు కిడ్నీలు తొలగించారని కేవలం సిటీ స్కాన్ ఆధారంగానే చెప్పలేమని అన్నారు. ప్రస్తుతం నిరంతరం డయాలసిస్‌పై ఉన్న సునితా దేవి ఆరోగ్యం కొంత మెరుగుపడితే మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాతే ఆమె రెండు కిడ్నీల గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఎలాంటి అనుమతులు లేకుండానే నర్సింగ్ హోమ్ రన్ చేసి పేషెంట్స్ ప్రాణాలతో చెలగాటమాడుతున్న శుభ్‌కాంత్ సింగ్ క్లినిక్ దొంగల ముఠా ఆచూకీ గురించి గాలిస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలు నిందితుల వేటలో నిమగ్నమైనట్టు సర్కా పోలీసు స్టేషన్ ఇంచార్జ్ ఇన్‌స్పెక్టర్ సరోజ్ కుమార్ తెలిపారు.
Kidneys Theft: ఆస్పత్రికి వెళ్లిన మహిళ రెండు కిడ్నీలు మాయం.. అవయవాల దొంగల ముఠా పనేనా