2017 న్యూస్ హెడ్‌లైన్స్‌లో 'తెలంగాణ'

2017 ఏడాది ముగిసిపోతున్న తరుణంలో.. ఈ ఏడాదిలో తెలంగాణలో పబ్లిక్ దృష్టిని ఆకర్షించిన పలు అంశాలు, పలు సందర్భాల్లో పతాక శీర్షికలకెక్కిన వివాదాలు, క్రీడాకారులు సాధించిన రికార్డులు, ప్రాధాన్యత సంతరించుకున్న పలు ఘటనలపై ఓసారి ఫోకస్ చేసే చిరు ప్రయత్నమే ఈ '2017 న్యూస్ హెడ్‌లైన్స్‌లో 'తెలంగాణ''. 

Last Updated : Dec 30, 2017, 07:11 PM IST
  • 2017లో తెలంగాణలో పబ్లిక్ దృష్టిని ఆకర్షించిన అంశాలు
  • పతాక శీర్షికలకెక్కిన పలు వివాదాలు
  • క్రీడాకారులు సాధించిన రికార్డులు
  • ప్రాధాన్యత సంతరించుకున్న పలు ఘటనలు
2017 న్యూస్ హెడ్‌లైన్స్‌లో 'తెలంగాణ'

2017 ఏడాది ముగిసిపోతున్న తరుణంలో.. ఈ ఏడాదిలో తెలంగాణలో పబ్లిక్ దృష్టిని ఆకర్షించిన పలు అంశాలు, పలు సందర్భాల్లో పతాక శీర్షికలకెక్కిన వివాదాలు, క్రీడాకారులు సాధించిన రికార్డులు, ప్రాధాన్యత సంతరించుకున్న పలు ఘటనలపై ఓసారి ఫోకస్ చేసే చిరు ప్రయత్నమే ఈ '2017 న్యూస్ హెడ్‌లైన్స్‌లో 'తెలంగాణ''. 

> 8వ అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ హైదరాబాద్‌కి వచ్చిన నేపథ్యంలో ఆమె కోసం హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తీరు కేవలం భారత్‌లోనే కాదు.. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై చివరకు అమెరికాలోని మీడియా సంస్థలు సైతం పుంకానుపుంకాలుగా కథనాలు రాసుకోవడం గమనార్హం.

> హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చే కలల ప్రాజెక్టులో ఒకటైన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు జాతికి అంకితమైంది ఈ ఏడాదిలోనే. నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో రైలుని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ తర్వాత కాసేపట్లోనే 8వ అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుని ప్రారంభించారు. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ ప్రాజెక్టు తొలి దశలో నాగోలు నుంచి మియాపూర్ వరకు నిర్మించిన మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. 

> ఒకే రోజు రెండు ప్రతిష్టాత్మక( హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం, 8వ అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు ప్రారంభోత్సవం) కార్యక్రమాలకి వేదికైన హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు, భద్రతా బలగాలకి ఒక ఛాలెంజ్‌గా నిలిచింది. 

> రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి నిర్వహించిన ప్రపంచ తెలుగు మహా సభలకి హైదరాబాద్ నగరమే వేదికైంది. తెలుగు భాషా రంగానికి, తెలుగు సాహిత్యానికి సేవలు అందించిన ఎందరో సాహితీవేత్తలని స్మరించుకుని, వారిని గౌరవించుకోవాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈ  కార్యక్రమం తెలంగాణను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది.

> తెలంగాణకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, గేయ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి (సినారె) మృతిచెందింది ఈ ఏడాదే. తెలంగాణ గడ్డపై పుట్టి, తెలుగు భాషా సాహిత్యానికి ఎనలేని సేవలు అందించిన సినారె మృతి యావత్ తెలుగు ప్రపంచానికి తీరని లోటుని మిగిల్చింది.

> దర్శకరత్నగా పేరొందిన ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు, రచయిత, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు కన్ను మూసింది కూడా ఇదే ఏడాది. కిడ్నీలు, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రి పాలైన దాసరి నారాయణ రావు.. అనారోగ్యం బారి నుంచి తిరిగి కోలుకుంటున్న దశలోనే తుది శ్వాస విడిచారు.

 తెలుగు సినీ పరిశ్రమకి పెద్ద దిక్కుగా, తెలుగు సినీ ప్రముఖులు అందరికీ ఆత్మీయ బంధువుగా, గురువు గారిగా గుర్తింపు పొందిన దాసరి అకాల మరణం తెలుగు సినీ పరిశ్రమని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 
తెలుగు వారు గర్వించదగిన దర్శకదిగ్గజం దాసరి నారాయణ రావు అంత్యక్రియలని రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పూర్తిచేసి, అతడి పట్ల తమకి వున్న గౌరవాన్ని చాటుకుంది తెలంగాణ ప్రభుత్వం.

> గతేడాది లాగే ఈ ఏడాది కూడా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌కి ఎదురులేకుండానే గడిచిపోయినప్పటికీ... తెలంగాణలో ఎదిగేందుకు ఎన్నో పాట్లు పడుతున్న టీడీపీకి ఈ ఏడాది చివర్లో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి రూపంలో ఓ ఎదురుదెబ్బ తగిలింది. 

తెలంగాణలో టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వున్న రేవంత్ రెడ్డి.. అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో టీడీపీ నేతలు టీఆర్ఎస్ నేతలతో దోస్తీ చేయడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ టీడీపీకీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీకి ఎంతమేరకు కలిసొస్తుందనే అంశాన్ని పక్కనపెడితే, అతడు పార్టీ వీడటం మాత్రం టీడీపీకి గట్టి దెబ్బే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

> ఇక తెలంగాణలో తమ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా ప్రయత్నిస్తున్న పార్టీల్లో ఒకటైన బీజేపీ కూడా తమ వంతు ప్రయత్నాల్లో వుంది. అందులో భాగంగానే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ ఏడాది మార్చి నెలలో మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించి పార్టీ వర్గాల్లో కొత్త జోష్ ని నింపే ప్రయత్నం చేశారు. 

> రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సైతం ప్రభుత్వ పాలనలోని లోపాలని వేలెత్తి చూపేందుకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాలు, రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలపై తమ పోరాటం సాగిస్తూ అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ వస్తున్నాయి.

> ప్రజాకర్షక పథకాలు, పనితీరుతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకుగాను ఈ ఏడాది పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా తెలంగాణ - ఫైబర్ గ్రిడ్ (టీ-ఫైబర్) ప్రాజెక్ట్ అందరికీ అందుబాటులోకి వస్తుందని అన్నారు. దేశం డిజిటల్ ఇండియా మిషన్ తో ముందుతు సాగిపోతున్న తరుణంలో తెలంగాణ గ్రామాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ - ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను చేపట్టినట్టు మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.

> ముస్లిం మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం 12%, గిరిజన తెగల సంక్షేమం కోసం 10% రిజర్వేషన్లని కలిపించే బిల్లు ఈ ఏడాదే తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందింది. 

> మావోయిస్ట్ అగ్రనేత, సీపీఐ(మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు గినుగు నర్సింహా రెడ్డి అలియాస్ జంపన్న డిసెంబర్ చివరి వారంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. గినుగు నర్సింహా రెడ్డితోపాటు అతడి జీవిత భాగస్వామి అయిన మరో మావోయిస్ట్ హింగె అనిత అలియాస్ రజిత కూడా పోలీసులు ఎదుట లొంగిపోయారు. కేంద్ర కమిటీ వైఖరితో విభేదించినందువల్లే తాను అజ్ఞాతం వీడినట్టు గినుగు నర్సింహా రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

గత మూడు దశాబ్ధాలుగా ఉద్యమంలో వుండి దేశ వ్యాప్తంగా దాదాపు 100కుపైగా నేరాల్లో పాల్పంచుకున్న మావోయిస్టుగా పేరున్న జంపన్నపై రూ.25 లక్షల రివార్డు వుంది. 

> లాస్ట్.. బట్ నాట్ లీస్ట్! హైదరాబాద్ లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమిలో శిక్షణ పొందుతున్న పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈ ఏడాది అత్యుత్తమ క్రీడా ప్రతిభను కనబర్చి పలు అంతర్జాతీయ వేదికలపై దేశం పేరు మార్మోగేలా చేశారు. సైనా నేహ్వాల్ సైతం ఈ ఏడాది మరోసారి తన సత్తా చాటుకుని ఐ యామ్ బ్యాక్ ఎగైన్ అనిపించుకున్నారు. 

2017 ఏడాది ఆరంభంలోనే మలేషియా మాస్టర్స్ గ్రాండ్ పిక్స్ లో గోల్డ్ మెడల్ చేజిక్కించుకున్న సైనా నేహ్వాల్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. గత మూడేళ్లుగా తన గురువు పుల్లెల గోపీచంద్ కి దూరమై విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటున్న సైనా నేహ్వాల్ ఈ ఏడాది సెప్టెంబర్ లో తిరిగి గోపీచంద్ కి చేరువై అతడి అకాడమీలో చేరారు.

Trending News