గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి పాకిస్థాన్ తో కలిసి కాంగ్రెస్ కుట్రలు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా ఖండించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాక్ అధికారులతో కలిశారని మోదీ చేసిన కుట్రపూరిత ఆరోపణపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
"ప్రధాని మోదీ స్వయంగా పాకిస్థాన్ లో భోజనం చేయడానికి వెళ్లారు. (లాహోర్ లో షరీఫ్ మనవరాలి పెళ్లికి హాజరయ్యారు). అప్పుడు ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు చేశారా? ఆయన భోజనం కూడా చేసి చేతులు కడుక్కున్నారు'. పాకిస్తాన్ ఎటువంటి కుట్రలు చేయలేదని ఫరూఖ్ అన్నారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. "కొంతమంది అప్రియమైన మాటలు మాట్లాడకపోయి ఉంటే.. అక్కడ కాంగ్రెస్ గెలిచేది" అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ విజయంపై మాట్లాడుతూ.. అక్కడ ప్రతిసారి ప్రభుత్వం మారుతుందన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామనే ఉద్దేశంతోనే ఆయన తెరపైకి పాకిస్థాన్ అంశాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు.