Telangana Temperatures: తెలంగాణలో శివరాత్రికి ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంతేకాదు ఇంట్లో క్షణం ఫ్యాన్ లేకుండా ఉండలేని పరిస్థితులు నెలకున్నాయి. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి.
Telangana Temperatures: తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు చోట్ల ఉండాల్సిన దాని కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దాంతో పాటు ఉక్కపోత తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది.
అంతేకాదు తెలంగాణలో 22 జిల్లాల్లో వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. మిగతా జిల్లాల్లోనూ 36కు పైగా రికార్డ్ అయ్యాయి.
బంగాళాఖాతం మీదుగా తూర్పు, ఆగ్నేయం నుంచి గాలులు వీస్తుండడంతో వాతావరణం వేడెక్కుతోందని వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి.
ఇపుడే ఇలా ఉంటే..మార్చి, ఏప్రిల్లో ముదురనున్న ఎండలు మేలో మంటెక్కించనున్నాయి. ఈ సారి రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు ఉంటాయంటున్నారు. ఆదిలాబాద్లో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సంక్రాంతి తర్వాత నుంచే వేడి ప్రారంభమైంది. మొన్నటి వరకు ఫ్యాన్ వేస్తే వణికి స్థితి నుంచి ఫ్యాన్ లేకుంటే ఉండలేని పరిస్థితులు నెలకున్నాయి.
మొత్తంగా చూసుకుంటే ఇంట్లో ఉక్కబోతతో ఉండలేని పరిస్థితి. మరోవైపు బయటకు వెళ్లాలంటే ఎండలు మంటెక్కిస్తున్నాయి. మొత్తంగా ఫిబ్రవరి మొదట్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే రాబోయే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజల గుండెల్లో ఇప్పటి నుంచే రైళ్లు పరిగెత్తుతున్నాయి.