CM Chandrababu Naidu: కేజ్రీవాల్‌ను చిత్తుగా ఓడించండి.. చంద్రబాబు నాయుడు పిలుపు

CM Chandrababu Naidu Slams Arvind Kejriwal: ఢిల్లీ సర్కార్‌పై సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారందరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఆప్‌ సర్కారు నిర్లక్ష్య పాలనతో ఢిల్లీ మురికి కూపంగా మారిందని.. సమస్యల వలయంలో చిక్కుకుపోయిందన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Feb 2, 2025, 11:35 PM IST
CM Chandrababu Naidu: కేజ్రీవాల్‌ను చిత్తుగా ఓడించండి.. చంద్రబాబు నాయుడు పిలుపు

CM Chandrababu Naidu Slams Arvind Kejriwal: ‘పదేళ్లకుపైగా అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేకపోయింది. దేశం స్వచ్ఛ భారత్‌లో దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి కూపంలోకి వెళ్లిపోతోంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు పొలిటికల్ పొల్యూషన్ కూడా ఉంది. 1995లో హైదరాబాద్ ఉన్నట్లు ఇప్పుడు ఢిల్లీ కూడా ఉంది. అభివృద్ధి రాజకీయాలు, జీవన ప్రమాణాలు పెరగాలంటే కమలం గుర్తును గెలిపించుకోవాలి. ఊపిరిపీల్చుకోవాలంటే మోదీ ఆక్సీజన్ కావాలి’ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధుల తరపును తెలుగు ఓటర్లు ఉండే ప్రాంతంలో ప్రచారం చేశారు. తెలుగు ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. 

బీజేపీ గెలుపులో తెలుగువారు భాగమవ్వాలి

‘ఢిల్లీలో ఇంతమంది తెలుగువారు ఉంటారని అనుకోలేదు. ఢిల్లీలో స్థిరపడ్డ ప్రతి తెలుగు ఓటరు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలి. తెలుగువారు ఢిల్లీలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు ఇది భారతీయులు, తెలుగువారి సత్తా. పెట్టుబడుల కోసం ఇటీవల దావోస్ వెళ్లినప్పుడు 650 మంది అక్కడ ఉన్నారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీని ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్నారు. 1995లో ఐటీ గురించి మాట్లాడాను... ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ఢిల్లీలోని ప్రజలు, ప్రత్యేకంగా తెలుగు తమ్ముళ్లు, చెళ్లెల్లు ఇంటింటికెళ్లి బీజేపీ గెలుపు.. దేశ చరిత్రకే ఒక మలుపు అని చెప్పాలి. ఐటీలో భారతీయులను ఢీ కొట్టే వారు ఎవరూ లేరు. నా తమ్ముళ్లు ప్రపంచంతా దూసుకుపోతున్నారు. దేశానికి యువత పెద్ద ఆస్తి. సరైన సమయంలో మన దేశానికి సరైన నాయకుడిగా మోదీ ఉన్నారు. మన దేశ బ్రాండ్ మార్మోగడానికి కారణం ప్రధాని మోదీ. 11 ఏళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణల్లో దేశాన్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. వికసిత్ భారత్ లో భాగంగా 2047 కల్లా దేశం నెంబర్ వన్ అవుతుంది. భారతీయులు శక్తివంతమైన జాతిగా మారతారు. కానీ ఢిల్లీకొస్తే చాలా బాధ కలుగుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చి ఉండుంటే వాషింగ్టన్, న్యూయార్క్‌ను ఢిల్లీ తలదన్నేది. ఉద్యోగాల కోసం ఇక్కడి నుంచి చాలామంది హైదరాబాద్, బెంగళూరు వెళ్లాలని చూస్తున్నారు. దీనికి కారణం ఇక్కడి పాలకులు. 

మురికి కూపంగా ఢిల్లీ

‘ఢిల్లీ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. ఈ దేశానికి రాజధాని అయిన ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుపోయి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. పదేళ్లు ఏం చేశారని అడిగితే స్కూళ్లు పెట్టామన్నారు. చదివిన వారికి ఉద్యోగాలు వచ్చాయా..? ఉద్యోగాలకు బెంగళూరు, హైదరాబాద్ వెళ్లడానికి కారణం ఇక్కడి పాలకులు. దేశం స్వచ్ఛ భారత్ వైపు దూసుకెళ్తుంటే.. ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారుతోంది. సరైన నీటి పైపులైన్లు లేక తాగునీరు కలుషితమౌతోంది. ఒక్కప్పుడు బీహార్ నుంచి ఇక్కడికి ఉపాధికి వచ్చేవారు... కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశం వెళ్తున్నారు. అభివృద్ధి జరిగిన చోటకు వలసలు ఉంటాయి. 

బీజేపీ గెలిస్తేనే సంక్షేమ ఫలాలు

‘ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్ధిక సాయం అందిస్తుంది. హోలీ, దీపావళి పండుగకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు రూ.500కు సిలిండర్ అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా పేదల వైద్యం కోసం రూ.5 లక్షలు, వృధ్యాప్య పెన్షన్లు రూ.2,500, వితంతువు, దివ్యాంగులకు రూ.3 వేలు ఇస్తుంది. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తుంది. గరీబ్ కళ్యాణ అన్న కింద 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తుంది. 

ప్యాలెస్‌లు కట్టుకునే వారు పాలకులుగా వద్దు

‘ఢిల్లీ వాసులకు తాగునీరు అందించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది. ప్రధాని అమృత్ కింద ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు ఇచ్చేందుకు మోదీ సంకల్పించారు. కేంద్రం ఇచ్చే సబ్సీడీని కూడా అసమర్ధ ప్రభుత్వం వినియోగించుకోలేదు. అధికారంలో బీజేపీ ఉండుంటే మోదీ నాయకత్వంలో స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఢిల్లీ స్వచ్ఛంగా ఉంటుంది. యమునా నదిని శుద్ధి చేస్తానని కేజ్రివాల్ ప్రగల్భాలు పలికారు...పదేళ్లులో చేయలేని వారు ఇప్పుడు చేస్తారా.? మోదీ నాయకత్వంలో గంగానది ప్రక్షాళన జరుగుతోంది.. యమునా శుద్ధి జరగాలంటే మోదీకే సాధ్యం. ఆప్ పాలనలో అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, మౌలిక సదుపాయలు లేవు. గాలి కాలుష్యం అయితే తట్టుకోలేనంతగా ఉంది. దేశవ్యాప్తంగా గెలిచి వచ్చి ఇక్కడ ఎంపీలుండే ప్రాంతంలో భయంకర పరిస్థితులు ఉన్నాయి. అధికారం కోసం కాదు... ప్రజాసేవ కోసం రాజకీయాలు చేయాలి. ఆయారాం, గయారాంలు కాదు.. సుస్థిర పాలన ఉండాలి. ప్యాలెస్‌లు కట్టుకునేవారిని కాదు... ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసేవాళ్లను ఎంచుకోండి. షహదారా ఎమ్మెల్యేగా సంజయ్ గోయల్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

ప్రత్యర్ధిపార్టీకి డిపాజిట్లు రాలేదు

‘ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి పోటీచేస్తే ప్రత్యర్ధి పార్టీ గల్లంతైంది. డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయింది.. 7 నెలల్లోనే రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. డబుల్ ఇంజన్ సర్కారు రావాలంటే బీజేపీ గెలిపించాలి. బీజేపీ గెలిస్తే మోదీ ఢిల్లీని అభివృద్ధిలో పరిగెత్తిస్తారు. ప్రపంచ నేతలు వచ్చినప్పుడు ఢిల్లీని చూసి ఇలా ఉందేంటి అంటే మనకు బాధకలుగుతోంది. ఉచిత రేషన్ నుంచి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల వరకు, జల్ జీవన్ మిషన్ నుంచి డిజిటల్ ఇండియా వరకు దేశ భవిష్యత్ కోసం మోదీ చేపట్టారు. డిజిటల్ ఇండియా, మేక్‌ ఇన్ ఇండియా, జల్ జీవన్ మిషన్ వంటి కార్యక్రమాలు చేపట్టారు. నూతన బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని భ్రష్ఠు పట్టించి నాశనం చేసింది. కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టు పట్టించారు. పంజాబ్ ఒకప్పుడు దేశాన్ని రక్షించడానికి మందుండటంతో పాటు ఆహారాన్ని అందించేంది. అలాంటి రాష్ట్రం ఆర్ధికంగా బలహీనపడింది. నాయకుడికి కావాల్సింది ప్రజలకు ఏం కావాలో ఇస్తూనే భవిష్యత్ ప్రణాళిక రూపొందించేట్లు ఉండాలి. 

ప్యాలెస్‌లోకి ప్రవేశించకముందే చిత్తుగా ఓడించండి

‘ఏపీలో రుషికొండ ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్‌లోకి ప్రవేశించేలోపే జగన్ ఇంటికి వెళ్లాడు. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ బ్రహ్మాండమైన శేషమహల్ కట్టారు. ఆ శేషమహల్‌లోకి ప్రవేశించడానికి ముందే మీరుచిత్తుగా ఓడించాలి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. ఒకప్పుడు దేశ విభజనను సర్ధార్ వల్లాభాయ్ పటేల్ అడ్డుకుని ఏకం చేశారు. అటువంటి గట్టి నాయకుడు మోదీ టీం ఇండియా నినాదంతో ప్రపంచంలో నెంబర్ వన్‌గా చేయాలని పని చేస్తున్నారు. తెలుగువారు ఎక్కడున్నా ఒక్కటిగా ఉండాలి. మీకు అండగా, తోడుగా నేనుంటా.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Trending News