ఆ రెండు దేశాభివృద్ధికి రెండు కళ్లు: వెంకయ్య నాయుడు

భారతదేశానికి వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లవంటివని ఉపరాష్ట్రపతి యం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఈ రెండు రంగాల్లో సాధించే పురోగతి అత్యంత కీలకమన్నారు. 

Last Updated : Feb 17, 2020, 08:04 PM IST
ఆ రెండు దేశాభివృద్ధికి రెండు కళ్లు: వెంకయ్య నాయుడు

జంషెడ్‌పూర్: భారతదేశానికి వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లవంటివని ఉపరాష్ట్రపతి యం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఈ రెండు రంగాల్లో సాధించే పురోగతి అత్యంత కీలకమన్నారు. దేశంలోని తొలి పారిశ్రామిక నగరమైన జంషెడ్‌పూర్‌ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేటికీ భారతదేశంలో 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడుతున్నారని, ఆ తర్వాత ఎక్కువమంది ఆధారపడుతున్నది పరిశ్రమలపైనేనన్నారు. అందుకే ఈ రంగాల్లో సమగ్రాభివృద్ధి ద్వారానే నవభారత నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, అయితే అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు మరింత వినూత్నంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమల పాత్ర కీలకమని.. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో విజయవంతంగా పరిశ్రమలు నడుస్తున్నాయని, ఈ పద్ధతిలో సేవలను వీలైనంత త్వరగా అందించేందుకు వీలుంటుందన్నారు. పరిశ్రమల రంగంలో మౌలిక వసతులను మరింతగా పెంచుకోవడం ద్వారా దేశాభివృద్ధి పరుగులు పెడుతుందని నేను విశ్వసిస్తున్నానని అన్నారు. ఇందుకోసం పరిశ్రమల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి సారించాలని, అటోమొబైల్, గృహనిర్మాణం, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు మరింత ప్రోత్సాహాన్నందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలన్నారు.  

భవిష్యత్తులో ప్రపంచ పారిశ్రామిక రంగమంతా అటోమేషన్ పై ఆధారపడబోతుందనే తాజా సర్వేలను ఉటంకిస్తూ.. ఈ దిశగా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకునేందుకు తమ ఉద్యోగస్తులకు నైపుణ్యతను అందించాల్సిన అవసరాన్ని యాజమాన్యాలు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. 

భారతదేశంలో ప్రతిభకు కొదువేలేదని.. కానీ, ఆ ప్రతిభను సానబెట్టడమేనని ఆయన అన్నారు. నైపుణ్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు ముందుకు తీసుకెళ్లాడాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంలోనూ సంయుక్త ప్రయత్నాలు అవసరమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొడుతున్న శక్తులకు దూరంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 

భారత పారిశ్రామిక రంగానికి జేఆర్డీ టాటా చేసిన సేవలను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. దేశంలో తొలి స్టీల్ ప్లాంట్‌ను జంషెడ్‌పూర్‌లో ఏర్పాటుచేయడంలో ఆయన పాత్ర కీలకమన్నారు. భారత బంగారు భవిష్యత్తును ముందే గుర్తించిన దీర్ఘదృష్టి ఉన్న నేత జేఆర్డీ టాటా అని ప్రశంసించారు. జంషెడ్‌పూర్‌ ఏర్పడి వందేళ్లు అయిన సందర్భంగా నగర ప్రజలకు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్‌ స్టాంపును ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర మంత్రి శ్రీ చంపాయ్ సోరెన్, జార్ఖండ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ అనిల్ కుమార్, టాటా స్టీల్ సంస్థ ఉన్నతాధికారులు, కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News