15 ఫిబ్రవరి 2018. ఈ రోజునే పాక్షిక సూర్యగ్రహణం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో ఈ గ్రహణం కనిపించకపోవడం గమనార్హం. అమెరికా, చిలీ, బ్రెజిల్, అర్జెంటీనాతో పాటు పలు దేశాల వారికి మాత్రమే ఈ గ్రహణం ఈ సంవత్సరం కనిపిస్తోంది. గతేడాది ఆగస్టు 21వ తేదిన ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం తర్వాత మళ్లీ ఆరు నెలల తర్వాత ఈ రోజు ఏర్పడడం విశేషం. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు కొద్దిగా అడ్డురావడం వల్ల ఈ పాక్షిక సూర్య గ్రహణం సంభవిస్తుంది అంటున్నారు పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు.
ఈ రోజు అంటార్కిటికా టైమ్ జోన్ ప్రకారం ఉదయం 9 గంటలకే ఈ పాక్షిక సూర్యగ్రహణం ఆయా దేశాల ప్రజలకు కనిపిస్తుంది. అయితే పలు మతాల్లో ఈ సూర్య గ్రహణాన్ని అశుభ సూచకంగా చూడడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు కూడా మూసివేస్తారు. ఈ సూర్య గ్రహణానికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని అంటుంటారు. నెలల వయసున్న పిల్లలను కూడా బయటకు తీసుకురాకూడదని చెబుతుంటారు. అయితే ఇవ్వన్నీ మూఢాచారాలు మాత్రమే అని హేతువాదులు కొట్టివేయడం గమనార్హం.