మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నెట్ బ్యాంకింగ్ కస్టమరా? అయితే మీరు డిసెంబర్ 1, 2018 లోగా బ్యాంకులో మీ మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోండి. లేకపోతే డెడ్ లైన్ తర్వాత నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి లేదా నెట్ బ్యాంకింగ్ అకౌంట్ బ్లాక్ అవుతుంది.
ఎస్బీఐ తాజాగా తన ప్రకటనతో నెట్ బ్యాంకింగ్ కస్టమర్లను అలర్ట్ చేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ 'ఆన్లైన్ ఎస్బీఐ' ద్వారా యూజర్లను జాగ్రత్త చేస్తోంది. బ్రాంచ్ వద్దకి వెళ్లి మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేయించుకోవాలి (ఇప్పటివరకు చేయించుకోకపోతే). లేకుంటే నెట్ బ్యాంకింగ్ అకౌంట్ బ్లాక్ అవుతాయి అని హెచ్చరించింది.
'ఇంటర్నెట్ బ్యాకింగ్ యూజర్లకు (ఐఎన్‌బీ) ముఖ్య గమనిక. బ్యాంకు బ్రాంచీలో మీ మొబైల్ నెంబర్‌తో వెంటనే రిజిస్టర్ చేసుకోండి (ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోకపోతే). లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు 01.12.2018 నుండి నిలిచిపోతాయి.' అని ఆన్లైన్ ఎస్బీఐ సైట్ తెలిపింది. ఎస్బీఐ ఖాతాతో మీ మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ కాకపోతే వెంటనే బ్యాంకు బ్రాంచీకి వెళ్లి రిజిస్టర్ కావాలని తన సందేశంలో ఎస్బీఐ పేర్కొంది.
జూలై 6, 2017 నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ)సర్కులర్ ప్రకారం, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్‌ల కోసం ఖాతాదారులు బ్యాంకుల వద్ద మొబైల్ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి మరియు ఈ మెయిల్ అలర్ట్‌ల కోసం ఈ మెయిల్‌ను బ్యాంకుల వద్ద నమోదు చేసుకోవాలి.
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, మొదలైనవి ఉంటాయి. ఆర్బీఐ మార్గదర్శకాల్లో భాగంగా ఎస్బీఐ ఈ తాజా నిర్ణయం తీసుకుంది.
నెట్ బ్యాంకింగ్‌తో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందా? లేదా అనేది ఇలా తెలుసుకోవచ్చు..
- www.onlinesbi.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ మీ లాగిన్, పాస్వర్డ్ వివరాలను నమోదు చేయండి.
- లాగిన్ అయ్యాక హోమ్ పేజీలో My Account and Profile ట్యాబ్‌లోకి వెళ్లండి.
- My Account and Profile ట్యాబ్‌లో Profile పై క్లిక్ చేయండి.
- అక్కడ మీ ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. గుర్తుంచుకోండి.. మీ ప్రొఫైల్ పాస్వర్డ్.. మీ లాగిన్ పాస్వర్డ్ రెండూ వేరు వేరుగా ఉంటాయి.
- ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను విజయవంతంగా నమోదు చేశాక.. రిజిస్టర్ అయిన మీ మొబైల్ నెంబర్, ఈ మెయిల్లు పాక్షికంగా కనిపిస్తాయి. (వీటిని మీరు మార్చలేరు)
ఒకవేళ మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ కాకపోతే, మీ దగ్గర్లోని హోమ్ బ్రాంచీని సందర్శించండి.