లక్నో: ఇటీవలే విధ్వంసానికి గురైన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్లోని బాదౌన్లో పునర్నిర్మించారు. అయితే ఈ విగ్రహం కాషాయ రంగులో ఉండడం గమనార్హం. బాదౌన్ జిల్లా యంత్రాంగం ఆదేశానుసారం బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే భీంరావ్ అంబేద్కర్ పేరును ఇకపై పూర్తి రూపంలో వాడాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. చాలామందికి రాజ్యాంగ నిర్మాత పూర్తిపేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్ అని తెలియదని.. ఇకపై అంబేద్కర్ పేరు మధ్యలో 'రాంజీ' ని జోడించి వాడనున్నట్లు తెలిపింది.
శుక్రవారం రాత్రి జిల్లాలోని దుగ్రియ్య గ్రామంలో అంబేద్కర్ విగ్రహం విధ్వంసం గురైన విషయాన్ని పోలీసులు, స్థానికులు వెలుగులోకి తెచ్చారు. నిరసనల తరువాత జిల్లా యంత్రాంగం ఆగ్రా నుండి ఈ కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చింది. సాధారణంగా నీలం రంగులో ఉండే అంబేద్కర్ విగ్రహం.. కాషాయ రంగులో ఉండడం గమనార్హం. 'కాషాయ' అంబేద్కర్ విగ్రహాన్ని పునర్నిర్నించేటప్పుడు అక్కడ బీఎస్పీ నాయకుడు హేమేంద్ర గౌతం తన మద్దతుదారులతో పాటు ఉన్నారు.
యూపీ ప్రభుత్వం కాషాయ రంగు మీదున్న ప్రేమతో ఇటీవలే మునిసిపల్ కార్పోరేషన్ సహాయంతో లక్నో గోమతి నగర్లో అనేక పార్కులు, డివైడర్లకు కాషాయ రంగు వేయించిన సంగతి తెలిసిందే...! గత ఏడాది డిసెంబర్లో లక్నోలోని హజ్ కార్యాలయ గోడలకు కాషాయ రంగు పెయింట్ వేయడం సమస్యగా మారింది. ప్రతిపక్ష, ముస్లిం మ సంస్థల నుంచి వ్యతిరేకత రావడంతో గోడలకు క్రీమ్ కోటింగ్ ఇచ్చారు.