దేశ వ్యాప్తంగా పోస్టాఫీస్ లలో పనిచేసే పోస్టుమెన్, ఉమెన్ లు ఇక నుంచి కొత్త డ్రెస్ లలో కనిపించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేశంలోని 90 వేలమంది పోస్టుమెన్, ఉమెన్స్ ఖాదీ వస్త్రాలు ధరించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, మనోజ్ సిన్హా కలిసి.. పోస్టుమెన్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ లు ధరించే వస్త్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కమ్యునికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా మాట్లాడుతూ- " ప్రధాన మంత్రి ఖాదీని ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేము ఖాదీ రంగులో ఉండే ఈ ఖాదీ యునిఫాంను నిర్ణయించాము. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ప్రక్రియను మేము నెలరోజుల క్రితమే ప్రారంభించాము" అన్నారు. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంఘం(కేవీఐసీ)కు ఖాదీ వస్త్రాల కోసం రూ.48 కోట్ల ఆర్డర్స్ ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. పోస్టుమెన్స్కు రెండు జతల బట్టలు (రెండు షర్ట్స్, రెండు ప్యాంట్స్) పోస్టుఉమెన్స్కు రెండు జతల సల్వార్ – కమీజ్ అందజేయనున్నారు. ఈ కొత్త ఖాదీ డ్రెస్ లో జేబు మీద, టోపీ మీద 'ఇండియా పోస్ట్' లోగో ఉంటుంది.