మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రస్తుతం తీవ్ర అస్వస్థతతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించినట్టు ఎయిమ్స్ వర్గాలు ఇవాళ ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో స్పష్టంచేశాయి. మరోవైపు బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల నేతలు వాజ్‌పేయిని పరామర్శించేందుకు ఎయిమ్స్‌కి క్యూ కట్టారు. అయితే వాజ్‌పేయి మృతి చెందినట్టుగా వైద్యులు ఇంకా ధృవీకరించక ముందే ప్రముఖ కన్నడ సినీ నటుడు ఉపేంద్ర ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. "భారతదేశానికి దక్కిన అత్యుత్తమ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయనకి ఇదే నా శ్రద్ధాంజలి. మా కోసం మళ్లీ తిరిగి రండి" అంటూ ఉపేంద్ర చేసిన ట్వీట్ నెటిజెన్స్ కి ఆగ్రహం తెప్పించేలా చేసింది.
అయితే, వాజ్ పేయి మృతిచెందక ముందే అలా ఎలా శ్రద్ధాంజలి ఘటిస్తారని నెటిజెన్స్ మండిపడటంతో తాను చేసిన తప్పేంటో తెలుసుకున్న ఉపేంద్ర వెంటనే ఆ ట్వీట్‌ని డిలీట్ చేశారు. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ట్విటర్ యూజర్స్ ఉపేంద్రను ట్రోల్ చేయడం మాత్రం ఆపలేదు.