Ghulam Nabi Azad Resign: కాంగ్రెస్ దిగ్గజ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ఇచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గులాంనబీ ఆజాద్ 5 పేజీల లేఖ రాశారు. పార్టీ పరిస్థితి ఇక చక్కదిద్దలేని స్థితికి చేరుకుందని లేఖలో గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించడం గమనార్హం. పార్టీతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూనే ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితి పట్ల గులాంనబీ ఆజాద్ తీవ్ర విచారం, ఆక్రోశం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్ష పదవి చేపట్టాక.. పార్టీలో అప్పటిదాకా ఉన్న సంప్రదింపుల వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. అప్పట్లో కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ మీడియా ముఖంగా చించివేయడం అతని అపరిపక్వతను బయటపెట్టిందన్నారు. రాహుల్ చేసిన ఈ పని 2014లో యూపీఏ ఓటమికి కారణమైందన్నారు. పార్టీలో అనుభవజ్ఞులైన నేతలను పక్కనపెట్టి అనుభవం లేని కొత్త కోటరినీ తీసుకొచ్చి పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నారని ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014-2022 మధ్య 49 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 39 ఎన్నికల్లో ఓటమిపాలైందన్నారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం దేశంలోని రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉందని.. మరో రెండు రాష్ట్రాల్లో జూనియర్ పార్ట్‌నర్‌గా సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం పార్టీలో రిమోట్ కంట్రోల్ మోడల్ కొనసాగుతోందని దుయ్యబట్టారు. ఈ కారణంగానే పార్టీ సంస్థాగత సమగ్రత విచ్ఛిన్నమైందన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్ర నామమాత్రంగా మారిపోయిందని.. రాహుల్ గాంధీ లేదా అతని సెక్యూరిటీ గార్డులు, పర్సనల్ అసిస్టెంట్‌లే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇటీవల జమ్మూకశ్మీర్ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ పదవికి గులాంనబీ ఆజాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై ధిక్కార స్వరం వినిపించిన జీ 23 నేతల్లో గులాంనబీ ఆజాద్ ఒకరిగా ఉన్నారు. పార్టీ అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరైన ఆజాద్ ఇలా హఠాత్తుగా రాజీనామా ప్రకటించడం కాంగ్రెస్‌కు గట్టి షాక్ అనే చెప్పాలి.
Also Read: డిజాస్టర్ టాక్ తో కూడా దుమ్ము రేపిన లైగర్ మూవీ.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook