కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణితి భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఓ డెంగ్యూ దోమగా సంబోధించారు. ఈ డెంగ్యూ వ్యాధి ముదరకుండా ఉండాలంటే.. వెంటనే బీజేపీ పార్టీని ప్రజలు రాబోయే ఎన్నికలలో బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతానికి ప్రణితి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సోలాపూర్‌లో జరిగిన పబ్లిక్ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ .. దేశంలో కొత్త డెంగ్యూ దోమ ఒకటి వచ్చిందని.. దానిని మోదీ బాబాగా మనం పిలుచుకోవచ్చని.. అందరినీ అనారోగ్యం పాలుజేయటం ఆ దోమకు అలవాటని ఆమె తెలిపారు.
అలాగే పలువురు బీజేపీ నేతలపై కూడా ప్రణితి విరుచుకు పడ్డారు. బీజేపీ నేత శరద్ భాన్సోడే ఓ పెద్ద తాగుబోతని.. అలాంటి తాగుబోతులకు టికెట్ ఇచ్చే బీజేపీ పార్టీని నమ్మవద్దని ఆమె తెలిపారు. ప్రధాని మోదీపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా వడగం ప్రాంతానికి చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ మోదీని నమ్మకద్రోహిగా అభివర్ణించారు.
అయితే ప్రణితి మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాక పలు సోషల్ మీడియా ఛానళ్ళలో ఆమె పై ట్రోలింగ్ మొదలైంది. పలువురు బీజేపీ కార్యకర్తలు ఆమె గురించి మాట్లాడుతూ.. స్లీవ్ లెస్ దుస్తులు ధరించి నైట్ పార్టీలకు వెళ్లే వారు కూడా ఈ రోజు మోదీ గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఇలాంటి చిల్లరి వ్యాఖ్యలు ఎన్ని చేసినా.. రాబోయే ప్రభుత్వం బీజేపీదేనని.. ప్రజలు కాంగ్రెస్ నేతలకు చెప్పాల్సిన బుద్ధి తప్పకుండా చెబుతారని.. అందుకు సమయం కూడా చాలా దగ్గరలోనే ఉందని పలువురు బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు.