దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బ్యాంకులోకి చొరబడి భీభత్సం సృష్టించారు. మాస్కులు ధరించి వచ్చిన ఆగంతకులు మారణాయుధాలతో బెదిరించి దొరికినంత డబ్బును దోచుకెళ్లారు. అడ్డుకున్న క్యాషియర్‌ను తుపాకితో కాల్చి చంపారు. పూర్తి సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన ఢిల్లీ ఖైరాలోని కార్పోరేషన్ బ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది.
శుక్రవారం యధావిధిగా బ్యాంకు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో.. ఒక్కసారిగా దోపిడీ దొంగలు బ్యాంకులోకి ప్రవేశించారు. అక్కడున్న కస్టమర్లు, సిబ్బందిని తుపాకులు, కత్తులతో బెదిరించారు. ఎవరినీ చంపమని చెప్పిన దుండగులు.. ఆ తర్వాత క్యాషియర్ అడ్డుకోవడంతో తుపాకీతో కాల్చి చంపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని అక్కడికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. కొన ఊపిరితో ఉన్న క్యాషియర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో నమోదవడంతో.. ఈ దోపిడీలో మొత్తం ఆరుగురు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
కాగా మృతి చెందిన క్యాషియర్ సంతోష్‌కుమార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఉద్యోగి. రిటైర్ అయ్యాక సంతోష్ కార్పోరేషన్ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. సంతోష్‌కు ఓ భార్య ఇద్దరు పిల్లలున్నారు.
#WATCH: CCTV footage of a corporation bank being robbed in Delhi's Khaira yesterday by armed assailants. Cashier was shot dead. Investigation underway. pic.twitter.com/4XSz1JX8AF
— ANI (@ANI) October 13, 2018