అస్సాంలో రామ్ ప్రకాష్ చౌహాన్ ముద్దుల బాబాగా సుపరిచితుడు. తన వద్దకు వచ్చే మహిళలకు ముద్దులు, కౌగిలింతలు ఇస్తూ రోగాలను నివారిస్తానని నమ్మబలుకుతూ.. గత కొంతకాలం నుండి స్థానికులను మోసం చేస్తున్న ఈ మోసగాడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...గౌహతికి దగ్గరలో ఉన్న మోరెగావ్ ప్రాంతంలో గత కొంతకాలంగా రామ్ ప్రకాష్ చౌహాన్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
తన వద్ద అతీంద్రియ శక్తులు ఉన్నాయని.. తాను ఎవరినైనా ముద్దు పెట్టుకున్నా.. కౌగలించుకున్నా వారికున్న రోగాలన్నీ మటుమాయమవుతాయని.. అలాగే వారి సమస్యలన్నీ కూడా తీరుతాయని చౌహాన్ ప్రచారం చేయడంతో తండోపతండాలుగా భక్తులు అతడి నివాసానికి క్యూ కట్టడం ప్రారంభించారు. అలా చౌహాన్ వద్దకు వచ్చిన వారిలో ఎక్కువమంది నిరక్ష్యరాసులు ఉండడం గమనార్హం. వారి బలహీనతలను తొలుత క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టిన చౌహాన్ ఆ తర్వాత.. తన వద్దకు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.
ఇటీవలే ఈ బాబా ఆగడాలు శ్రుతిమించడంతో పోలీస్ స్టేషనులో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. తర్వాత పోలీసులు ప్రత్యేకంగా ఈ బాబాపై నిఘా పెట్టి అరెస్టు చేశారు. ఈ మధ్యకాలంలో ఈ బాబా తనకోసం ఓ గుడి కూడా కట్టుకున్నాడని.. ఆ గుడికి కూడా భక్తులు రావడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు.
ఆ బాబా ఇచ్చే ముద్దులను "చమత్కారి చుంబన్" పేరుతో ప్రచారం చేసేవారని.. ఆ బాబా తల్లి ప్రచారకర్తగా ఉండి భక్తులను తీసుకువచ్చేవారని పోలీసులు తెలిపారు. రామ్ ప్రకాష్ చౌహాన్‌కి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే ప్రత్యక్షమై వరాలిచ్చాడని.. ఆ వరాల వల్లే తాను ముద్దులిస్తే రోగాలు తగ్గుతున్నాయని ఆయన తల్లి ప్రచారం చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసిన చౌహాన్ తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
Morigaon: Police arrested a self-styled godman Ram Prakash Chauhan from Bhoraltup village on August 22; he used to hug and kiss women on the pretext of curing their physical and psychological problems with his 'supernatural powers'. #Assam pic.twitter.com/eZH903iCb3
— ANI (@ANI) August 24, 2018