Arunchal Pradesh: సామాన్య పౌరులపై ఆర్మీ జవాన్ల కాల్పులు... అరుణాచల్ ప్రదేశ్‌లో కలకలం రేపుతోన్న ఘటన...

Civilians injured in Army firing in Arunachal Pradesh: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు సాధారణ పౌరులపై ఆర్మీ జవాన్ల కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2022, 06:12 PM IST
Arunchal Pradesh: సామాన్య పౌరులపై ఆర్మీ జవాన్ల కాల్పులు... అరుణాచల్ ప్రదేశ్‌లో కలకలం రేపుతోన్న ఘటన...

Civilians injured in Army firing in Arunachal Pradesh: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు సాధారణ పౌరులపై ఆర్మీ జవాన్ల కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. చేపల వేట తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్న పౌరులపై జవాన్లు కాల్పులు జరిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరప్ జిల్లా చాసా గ్రామంలో శుక్రవారం (ఏప్రిల్ 1) ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది పొరపాటున జరిగిన ఘటనగా ఆర్మీ పేర్కొనడం గమనార్హం. 

జవాన్ల కాల్పుల్లో గాయపడిన ఇద్దరిని నోక్‌ఫువా వాంగ్‌పాన్, రామ్‌వాంగ్ వాంగ్సుగా గుర్తించారు. వెంటనే వారిని అసోం దిబ్రుగర్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు. గాయపడిన ఇద్దరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆర్మీ మేజర్ ఒకరు వీడియో విడుదల చేసినట్లు తెలుస్తోంది. గాయపడిన ఇద్దరికి చికిత్స అందించడంతో పాటు వారికి పరిహారం అందించే బాధ్యతను తానే తీసుకుంటానని ఆ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. 

కాగా, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని హోలం-ఖోవథొంగ్ ప్రాంతాల్లో సాయుధ తిరుగుబాటుదారుల కదలికలపై విశ్వసనీయ వర్గాల నుంచి ఆర్మీకి సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఈ  క్రమంలోనే పొరపాటున సాధారణ పౌరులపై జవాన్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై స్పందించేందుకు జిల్లా ఎస్పీ నిరాకరించారు.

ఇదే తిరప్ జిల్లాలో ఈ ఏడాది మార్చి 21న ముగ్గురు అనుమానిత తిరుగుబాటుదారులపై ఆర్మీ జవాన్లు కాల్పులు జరపడంతో.. ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన తిరుగుబాటు గ్రూప్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN-IM).. మృతుల్లో ఒకరు సాధారణ పౌరుడు అని పేర్కొంది. 

గతేడాది డిసెంబర్‌లో నాగాలాండ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్లు ఉగ్రవాదులుగా పొరబడి సామాన్య పౌరులపై కాల్పులు జరపడంతో 13 మంది మృతి చెందారు. ఈ ఘటన నాగాలాండ్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 

Trending News