Telangana BJP President: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ప్రకటన ఇప్పట్లో లేనట్లేనా..? అధ్యక్షుడి ప్రకటన ఆలస్యం వెనుక కారణం అదేనా..?

Telangana BJP President:   తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి విషయంలో అసలు హైకమాండ్ ఆలోచన ఏంటి..? నెలల తరబడి నుంచి రేపు మాపు అధ్యక్షుడి ప్రకటన అంటూ లీకులే తప్పా ప్రకటన ఆలస్యం వెనుక కారణం ఏంటి..? అసలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉన్నదెవరు..? అధ్యక్షుడి ప్రకటన ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది..? అధిష్టానం అధ్యక్షుడిని నిర్ణయించినా అధికారికంగా ప్రకటించని స్థితిలో ఉందా..? అధిష్టానం తీరుపై తెలంగాణ కమల దళం ఎందుకు అసంతృప్తిగా ఉంది..?

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Jan 28, 2025, 05:43 PM IST
Telangana BJP President: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ప్రకటన ఇప్పట్లో లేనట్లేనా..? అధ్యక్షుడి ప్రకటన ఆలస్యం వెనుక కారణం అదేనా..?

Telangana BJP President:   తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన రోజు రోజుకు ఆలస్యం అవుతుంది..కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆ నాయకుడే అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. రేపో మాపో అధ్యక్షుడి ప్రకటన ఖాయం అనే ప్రచారం తప్పా ప్రకటన మాత్రం రావడం లేదు. దీంతో అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి  కేంద్ర మంత్రి కావడంతో ఆయా కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటున్నారు.అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు.దీంతో రాష్ట్రంలో కమలదళాన్ని నడిపించే నాయకుడు కరువయ్యారని  పార్టీలో తెగ ప్రచారం జరుగుతుంది. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరాడుతుంటే బీజేపీ మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారారని పార్టీలో చర్చించుకుంటున్నారు.తెలంగాణలో పార్టీనీ నడిపే నాయకుడు లేకపోవడంతో పరిస్థితి ఇలా మారిందని కార్యకర్తల అభిప్రాయం.  

 తెలంగాణలో  బీజేపీకీ సానుకూల వాతావరణం ఉన్నా దానిని దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని బీజేపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతున్నా ప్రజల నుంచి సరైన స్పందన లేదనేది బీజేపీ శ్రేణుల భావన. బీఆర్ఎస్ అధినేత ఫాం హౌజ్ కు పరిమితం కావడం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసులు నమోదు కావడంతో ఆ పార్టీలోనే గందరగోళం నెలకొందని రాష్ట్ర బీజేపీ క్యాడర్ అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు బీజేపీ దగ్గరయ్యేందుకు మంచి అవకాశం ఉందని అలాంటి అవకాశాన్ని వినియోగించలేకపోతున్నారని కాషాయ నేతలు తెగ ఆవేదన చెందుతున్నారు. 

ఇలాంటి తరుణంలో బీజేపీ పెద్దలు మాత్రం అధ్యక్షుడిని ప్రకటించకుండా నాన్చడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పార్టీనీ ముందుకు నడిపే ఎవరో ఒక నాయకుడు ఉంటే అప్పుడు పార్టీ బలోపేతం అవుతుందనేది వారి ఆలోచన. అలా కాకుండా అధ్యక్షుడి ప్రకటన ఆలస్యం చేస్తుండడంతో పార్టీకీ తీవ్ర నష్టం జరుగుతుందని వారు అనుకుంటున్నారు. దీనికి తోడు ఇటీవల బీజేపీ అధ్యక్షుడి రేసులో పలు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి . అలాంటి వారిలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘు నందన్ రావు తో పాటు మరి కొందరి పేర్లు కూడా అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతే కాదు వీరిలో ఈటెల రాజేందర్ కు దాదాపుగా అధ్యక్షుడి పదవి ఖాయం అయ్యిందని గత కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరిగి కూడా దాదాపుగా రెండు, మూడు వారాలు కావొస్తుంది కానీ అధ్యక్షుడి ప్రకటనపై మాత్రం బీజేపీ అధిష్టానం తేల్చలేదు.

ఐతే అధ్యక్షుడి ప్రకటనలో ఆలస్యం జరగడానికి పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అధ్యక్షుడిగా ఒకరి పేరు ప్రకటిస్తే మిగితా వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉన్నందున ప్రకటను నాన్చుతున్నారని పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతుంది.దీనికి తోడు ఈటెల రాజేందర్ ను అధ్యక్షుడిగా ప్రకటిస్తే బాగుంటుందనేది ప్రధాన మోదీ భావన కానీ దీనిపై మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు కొంత వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈటెల రాజేందర్ కు రాజకీయంగా , సామాజికవర్గంగా బలంగా ఉండడంతో మోదీ ఈటెల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. కానీ దీనిపై పార్టీలో కొంత వ్యతిరేకత ఉండడంతో ఆయన ప్రకటన ఆలస్యం అవుతుందనేది మరి కొందరి వాదన.

ఇది ఇలా ఉంటే ఈటెల కాదు తాము కూడా అధ్యక్షుడి రేసులో ఉన్నామని మా వంతు ప్రయత్నాలు చేస్తున్నామని ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు అంటున్నారు. మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన పెద్ద పేచీలా మారింది. విచిత్రం ఏంటంటే ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడి కోసం లాబీయింగ్ చేస్తున్నవారు  ముగ్గురు కూడా ఎంపీలు కావడం విశేషం. దీంతో ఢిల్లీలో ఈ ముగ్గురు తెగ లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేతల లాబీయింగ్ తోనే అధ్యక్షుడి ప్రకటన ఆలస్యం అవుతుందనేది పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. మరోవైపు బీజేపీ పెద్దలు అధ్యక్షుడి ప్రకటనను ఆలస్యం చేస్తే మాత్రం పార్టీకీ నష్టం తప్పదని అంటున్నారు. అసలే మరి కొద్ది రోజుల్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే పార్టీ ఆశిస్తున్న స్థాయిలో ఫలితాలు రావనేది వారి వాదన.

Also Read: Nita Ambani Gift: చిన్న కోడలు రాధికకు అత్త నీతా అంబానీ మరో ఖరీదైన 'ఆభరణం' గిఫ్ట్‌

Also Read: Mauni Amavasya: కుంభమేళాకు వెళ్లలేకపోతున్నారా..? ఇవి చేస్తే కుంభమేళాకు వెళ్లినంత పుణ్యఫలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News