గూగుల్ సెర్చ్‌లో "ఐడియట్" అని టైప్ చేస్తే చాలు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాలు కనిపిస్తున్నాయట. అయితే ఇలా జరగడానికి కారణం ట్రంప్ వ్యతిరేకులు చేస్తున్న నెగెటివ్ ఆన్ లైన్ ప్రచారం వల్ల వస్తున్న సెర్చ్ ఇంజిన్ ఫలితాలేనని పలువురు సైబర్ నిపుణులు అంటున్నారు. గూగుల్ ఆల్గర్తిమ్ ప్రకారం జనాలు ఎక్కువగా వెతికే పదాలు, చిత్రాలను బట్టి ఫలితాలు వస్తాయని.. ఇది సాంకేతికంగా జరిగే అంశమే తప్పితే... గూగుల్ సంస్థకు అధ్యక్షుడిపై ఎలాంటి దురుద్దేశమూ లేదని ఆ సంస్థ తెలిపింది.
గత వారం గార్డియన్ పత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం.. అనేకమంది రెడ్డిట్ యూజర్లు కావాలనే ఇడియట్ అనే పదానికి ట్రంప్ చిత్రాలు జోడించి నెగెటివ్ ప్రచారం కల్పించడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని తెలుస్తోంది. గతంలో ఇండియాకి చెందిన పలువురు నాయకులు కూడా యూజర్లు చేసే ట్యాగింగ్ వల్ల ఇబ్బందిలో పడ్డారు. ఉదాహరణకు, పప్పు అనే పదం టైపు చేస్తే చాలు వేలాదిగా రాహుల్ గాంధీ చిత్రాలు దర్శనమివ్వడమే అందుకు నిదర్శనం.
అలాగే "ఫేకు" అనే పదం టైపు చేస్తే.. నరేంద్ర మోదీ చిత్రాలు దర్శనమిచ్చాయి. అయితే తాజాగా ఈ లిస్టులో ట్రంప్ కూడా చేరడంతో గూగుల్ సంస్థ ప్రత్యమ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది. ప్రముఖుల పరువు నష్టాల విషయంలో తాము అత్యంత శ్రద్ధ చూపించడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటామని.. అయినా అప్పుడప్పుడు పొరపాట్లు జరగడం సహజమేనని గూగుల్ అధికారులు అంటున్నారు. గతంలో కూడా గూగుల్ గ్లోబల్ సెర్చి ఇంజిన్‌లో "ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్" అని టైపు చేస్తే.. నరేంద్ర మోదీ చిత్రమే కనిపించిందట.