సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన "కాలా" చిత్రం మొదటి రోజు కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్లు దాటినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులో రూ.17 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం, తెలుగులో రూ.7 కోట్లు, కేరళలో రూ.3 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.6 కోట్లు వసూలు చేసిందని పలు పత్రికలు తెలిపాయి. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కూడా "కాలా" ప్రభంజనం సృష్టించిందనే చెప్పుకోవచ్చు.
దాదాపు రూ.17 కోట్లను ఈ చిత్రం వసూలు చేసింది. అయితే రజనీకాంత్ గత చిత్రం "కబాలి"తో పోల్చుకుంటే ఈ వసూళ్లు తక్కువనే చెబుతున్నారు విశ్లేషకులు. "కబాలి" మొదటి రోజు దాదాపు 80 కోట్లకు పైగానే వసూలు చేసింది.
అయితే "కాలా" చిత్రం ఆ స్థాయిలో వసూళ్ళను రాబట్టుకోలేకపోయింది. రూ.140 కోట్ల బడ్జెట్తో రూపొందిన "కాలా" ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం బాగానే చేసిందని వార్తలు వచ్చాయి. విడుదలకు ముందే ఈ చిత్రం థియేట్రికల్, మ్యూజికల్, శాటిలైట్ రైట్స్ ద్వారా రూ. 230 కోట్లు వసూళ్లు చేసిందని పలు పత్రికలు రాశాయి.
పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన "కాలా" చిత్రంలో నానా పటేకర్, ఈశ్వరి రావు, సముద్రఖని, హ్యుమా ఖురేషి, షాయాజీ షిండే, సంపత్ రాజ్, రవి కాలే, అంజలి పాటిల్, సాక్షి అగర్వాల్ మొదలైన వారు నటించారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.