షెహనాయ్ కా సామ్రాట్ ‘ఉస్తాద్ బిస్మిల్లాఖాన్’

భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జయంతి నేడు. ఆయన 102వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేక' డూడుల్ ను రూపొందించింది.

Last Updated : Mar 21, 2018, 08:29 AM IST
షెహనాయ్ కా సామ్రాట్ ‘ఉస్తాద్ బిస్మిల్లాఖాన్’

భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జయంతి నేడు. ఆయన 102వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేక' డూడుల్ ను రూపొందించింది. ఉత్తర భారతదేశంలో షెహనాయ్ గా పిలిచే సన్నాయిని ఉపయోగించి వినూత్నంగా స్వరాలు, బాణీలు కనిపెట్టి ప్రంపంచానికి పరిచయం చేశారు బిస్మిల్లాఖాన్. కనుకనే షెహనాయ్ అంటే బిస్మిల్లాఖాన్.. బిస్మిల్లాఖాన్ అంటే షెహనాయ్ గా స్థిరపడిపోయింది. ఆ మహనీయుడి జయంతి ఇవాళ. ప్రపంచం మరిచిన ఆ మహనీయుడిని సగర్వంగా గౌరవించుకుంటుంది జీన్యూస్ తెలుగు.

ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయి రాగం విననిదే కాశి గుడి తలుపులు తెరుచుకొవు. ఒక ముస్లిం అయి ఉండి కాశీ విశ్వనాథుడిని, సరస్వతి దేవిని కొలిచేవారు. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ సాహెబ్ (1916 మార్చి 21 - 2006 ఆగస్టు 21) భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు. 2001లో భారత ప్రభుత్వం ఆయనను 'భారతరత్న' తో సత్కరించింది. ఈ సత్కారాన్ని పొందిన సాంప్రదాయక సంగీత విద్వాంసులలో బిస్మిల్లాఖాన్ మూడవ వ్యక్తి.

బిస్మిల్లాఖాన్ జన్మస్థలం బీహారులోని డుమ్రాన్ జిల్లాలో, బిరుంగ్ రౌట్ కి గలి అనే ప్రాంతం. అసలు పేరు అమీరుద్దీన్‌ ఖాన్‌. ఆయన తండ్రి పేరు పైగంబర్ ఖాన్. ఉస్తాద్ పూర్వీకులు భోజ్‌పూర్ లోని నక్కర్‌ఖానాలో ఆస్థాన సంగీత విద్వాంసులు. తండ్రి డుమ్రాన్ లోని మహారాజా కేశవ్ ప్రసాద్ సింగ్ ఆస్థానంలో షెహనాయ్ విద్వాంసులు. బిస్మిల్లాఖాన్ తన మామయైన కీ.శే.అలీ బక్ష్ విలాయతు వద్ద శిక్షణను తీసుకొన్నారు. ఆయన వారణాసి విశ్వనాథుని దేవాలయంలో షెహనాయ్ వాయించేవారు. బిస్మిల్లాఖాన్ గొప్ప సరస్వతీ దేవి భక్తుడు. పూరీ జగన్నాథాలయంలో, ఎక్కువగా గంగా తీరాన ఉన్న విశ్వనాథుని దేవాలయంలో కచేరీలు నిర్వహించి సర్వమత సమభావనను చాటిచెప్పారు.

1937లో కోల్‌కతా భారతీయ సంగీత సమ్మేళనంలో షెహనాయికి మంచి ప్రాచుర్యాన్ని తీసుకొని రావడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో ఆయన తన కచేరీల నిచ్చారు. భారత స్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లోఆయన ఢిల్లీ లోని ఎర్రకోటలో వాద్య కచేరీ నిచ్చారు. జనవరి 26, 1950 భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఆయన ఎర్రకోటలో కాఫి రాగాన్ని తన షెహనాయిపై ఆలపించారు. షెహనాయ్‌ వాద్యానికి ప్రపంచంలో గొప్ప స్థానాన్ని కల్పించారు బిస్మిల్లాఖాన్.

సత్కారాలు: పద్మశ్రీ(1961), పద్మ భూషణ్(1968)‌, పద్మ విభూషణ్(1980)‌, భారతరత్న (2001) వంటి అత్యున్నత పౌరపురస్కారాలతో పాటు అనేక సంగీత అవార్డులను అందుకున్నారు.

అంతర్జాతీయంగా అంత పేరు ప్రఖ్యాతులు గడించిన ఈ షెహనాయి కృతి కర్త, ఏనాడు ఎటువంటి ఆడంబరాలకు పొంగిపోలేదు. సామాన్యుడిలా ఎప్పుడూ వినమ్రతతో తన సాధనలో ఉండేవారు. సమాజ అభ్యున్నత కార్యక్రమాలకు చేయూతనిచ్చేవారు. సన్నాయికి అంతర్జాతీయ గుర్తింపు, అభిమానులను సంపాదించి పెట్టిన ఈ షెహనాయ్ సామ్రాట్ ఆగస్టు 21 2006లో 91 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించారు. ఆయన చనిపోయినప్పుడు, షెహనాయిని ఆయనతో పాటే పూడ్చిపెట్టారు. అంతగా అనుబంధం వుండేది ఆయనకు షెహనాయీతో.

ఆయన భౌతికంగా మనమధ్య లేకపోయినా.. తన కాఫీ రాగంతో ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవించి ఉన్నారు. మానవాళి నశించినా, సంగీతం బతుకుతుంది. సంగీతానికి కులం లేదు, అని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనేవారు.  

 

Trending News