జీఎస్ టీ సినిమా వ్యవహారం వర్మ మెడకు మరింత బిగిసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణలో విచారణ ఎదుర్కొంటున్న వర్మకు ఏపీలోనూ గడ్డు పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మహిళా సంఘాల దీక్షతో దిగివచ్చిన ఏపీ సర్కార్ ఆయనపై 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎంవీపీ పీఎస్ లో ఈ కేసు నమోదైంది. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ( జీఎస్టీ) సినిమాపై ఓ టీవీ చానల్ నిర్వహించిన చర్చ సందర్భంగా వర్మ తనను కించపరచడంతో పాటు అసభ్యంగా మాట్లాడారంటూ ఐద్వా నగర సహాయ కార్యదర్శి పి.మణి ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు దర్శకుడు వర్మపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
తొలుత ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు ఈ కేసు తమ పరిధిలోకి రాదని..ఇది సైబర్‌క్రైమ్ కిందకు వస్తుంది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలంటూ పోలీసులు ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించారు. మరోవైపు సైబర్‌క్రైమ్ వారు కూడా ఈ వ్యవహారం తమ పరిధిలో లేదన్నారు. దీంతో ఆగ్రహించిన మహిళా సంఘాలు వర్మపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలన్నీ కొద్దిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నాయి. బుధవారం మహిళా సంఘాల ప్రతినిధులు విశాఖలో 48గంటల నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప నగర పోలీస్ కమిషనర్ యోగానంద్‌కు ఫోన్‌చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో వర్మపై కేసు నమోదైంది.