ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రైసుమిల్లు ఏర్పాటుకానుంది. దుబాయ్‌కు చెందిన ఫోనిక్స్ సంస్థ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో మెగా ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్ ప్రాజెక్టును నెలకొల్పుతామని, ఈ ఏడాది ఏప్రిల్‌లో పనులు ప్రారంభిస్తామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈవో గౌరవ్ ధావన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్నారు. ఫిబ్రవరి నెలాఖారులో విశాఖపట్టణంలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులను ఆకర్షించేందుకు దుబాయ్‌లో పర్యటించిన ముఖ్యమంత్రితో గౌరవ్ థావన్ భేటీ అయి, మెగా ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్ ప్రాజెక్టుపై చర్చించారు.
అమెరికాకు చెందిన కొన్ని కంపెనీల సహకారంతో తాము నెలకొల్పుతున్న ప్రాజెక్టు ఉక్రెయిన్‌లో త్వరలో ప్రారంభం కానుందని, ఆ తరువాత భారత్ మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరిస్తామని సీఎంకి థావన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో వ్యవసాయ రంగంలో అనుసరిస్తున్న వినూత్న విధానాల గురించి సీఎం వారికి వివరించారు. అనంతపురంలో వేరుశనగ సాగు చేపట్టేందుకు గల అవకాశాలు పరిశీలించి, వేరుశనగ నుంచి బటర్ తయారుచేసే యూనిట్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించిన లాజిస్టిక్స్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ‘షరాఫ్ గ్రూపు’కు అనుమతులు, భూ కేటాయింపుల విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చాము. పూర్తి స్థాయి ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్‌కు రావాలని కోరాము. pic.twitter.com/fmzVbREsgD
— N Chandrababu Naidu (@ncbn) February 8, 2018
సామర్లకోటలో నెలకొల్పే రైస్ మిల్ ప్రాజెక్ట్ ఏడాదికి 3 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే ప్రపంచంలోని అతి పెద్ద రైస్‌మిల్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇందులో లక్ష మెట్రిక్ టన్నులను దేశంలో, మిగిలిన 2 లక్షల మెట్రిక్ టన్నులను విదేశాలకు ఎగుమతి చేయాలని ఫోనిక్స్ కంపెనీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 400 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
ముఖ్యమంత్రి బృందంలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ప్రిన్సిపల్ కార్యదర్శి జి.సాయి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) అజయ్ జైన్, ఏపీఈడీబి సీఈవో జాస్తి కృష్ణ కిషోర్‌లు ఉన్నారు.