Vikarabad Missing Case: వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు దొరశెట్టి సత్యమూర్తి మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంటికి తాళం వేసిన సత్యమూర్తి పిల్లలతో కలిసి అదృశ్యమయ్యారు. అదృశ్యానికి ముందు, ఆయన రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 3 నెలల క్రితం అదృశ్యమైన తన భార్య ఆచూకీని కనిపెట్టాలని సెల్ఫీ వీడియోలో పోలీసులకు సత్యమూర్తి విజ్ఞప్తి చేశారు. 48 గంటల్లోగా ఆచూకీ కనిపెట్టకపోతే తమ శవాల లొకేషన్ పోలీసులకు షేర్ చేస్తానని హెచ్చరించారు.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా తాండూరుకి చెందిన దొరశెట్టి సత్యమూర్తికి భార్య అన్నపూర్ణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సత్యమూర్తి వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 3 నెలల క్రితం సత్యమూర్తి భార్య అన్నపూర్ణ ఇంటి నుంచి అదృశ్యమైంది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నా.. ఇప్పటివరకూ ఆమె ఆచూకీ దొరకలేదు. భార్య మిస్సింగ్‌తో సత్యమూర్తి, ఆయన కూతుళ్లు మానసికంగా కుంగిపోయారు.
ఈ క్రమంలో తమ తల్లి ఆచూకీ చెప్పాలంటూ గతంలోనూ ఆయన కూతుళ్లు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేశారు. ఆమె ఆచూకీ తెలిపినవారికి రూ.5 లక్షలు బహుమానం కూడా ఇస్తామని ప్రకటించారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సత్యమూర్తి ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో సత్యమూర్తి కూతుళ్లు మాట్లాడుతూ.. తమ తల్లి లేకపోతే తాము బతకలేమని దయచేసి ఆమె ఆచూకీ కనిపెట్టాలని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
సత్యమూర్తి మాట్లాడుతూ.. ఇది కేవలం మిస్సింగ్ కేసు కాదన్నారు. ఇందులో పెద్దవాళ్ల ఇన్వాల్వ్‌మెంట్ ఉందని ఆరోపించారు. తన వద్ద ఉన్న ఆధారాలను పెన్‌డ్రైవ్‌లో నిక్షిప్తం చేసి ఉంచినట్లు తెలిపారు. పోలీసులు 48 గంటల్లోగా తన భార్య అన్నపూర్ణ మిస్సింగ్ కేసును చేధించకపోతే తమ శవాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ లొకేషన్ కూడా పోలీసులకు షేర్ చేస్తానన్నారు. ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత సత్యమూర్తి, ఆయన కూతుళ్లు కనిపించకుండా పోయారు.
సత్యమూర్తి వీడియోపై స్పందించిన పోలీసులు ఆయన వెనక్కి వచ్చి పోలీసులకు సహకరించాలని.. భావోద్వేగానికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సత్యమూర్తి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. ఆ సమయంలో ఒక లేఖ కూడా రాసి పెట్టిందని తెలిపారు. ఆరోగ్య సమస్యలను అందులో ఆమె ప్రస్తావించిందని.. చనిపోవడానికే వెళ్తున్నట్లుగా అందులో చెప్పుకొచ్చిందని పేర్కొన్నారు. కేసును ఇంకా మూసేయలేదని.. ఎన్ని రోజులైనా సరే దర్యాప్తు జరిపి ఆమె ఆచూకీ కనిపెడుతామని అన్నారు.
Also Read: Droupadi Murmu: విపక్ష కూటమికి బిగ్ షాక్.. ద్రౌపదీ ముర్ముకు మాయావతి సపోర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి