Telangana Politics: హద్దులు దాటుతున్న నేతల విమర్శలు, చీదరించుకుంటున్న ప్రజలు

Telangana Politics: తెలంగాణ రాజకీయాలు దిగజారిపోతున్నాయా...? నేతల మాటలు సామాన్య జనాలు సైతం అసహ్యించుకునేలా ఉంటున్నాయా..? నేతలు మాట్లాడుతున్న భాష, వ్యవహరిస్తున్న తీరు విమర్శలపాలవుతుందా....? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను రాజకీయాల్లోకి లాగడం సరైందేనా?

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Oct 3, 2024, 02:03 PM IST
Telangana Politics: హద్దులు దాటుతున్న నేతల విమర్శలు, చీదరించుకుంటున్న ప్రజలు

Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. గత కొద్ది నెలలుగా తరుచూ ఏదో ఒక అంశంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్దం కొనసాగుతుంది. అధికార,ప్రతిపక్షాల మధ్య రోజుకొక అంశంపై మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య ప్రచ్చన్న యుద్దం మొదలైంది. రుణమాఫీ, రైతుభరోసా, ఆరు గ్యారెంటీలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేస్తుంటే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై అదే స్థాయిలో విరుచుకుపడుతుంది. ప్రజలకు సంబంధించిన అంశాలు కాబట్టి పార్టీల తీరును ఎవ్వరూ పెద్దగా తప్పుబట్టలేదు. 

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రతిపక్షం డిమాండ్ చేయడం తప్పులేదు. అంతే కాదు అధికారపక్షంపై ప్రతిపక్షం ఒత్తిడి తీసుకురావడం ప్రతిపక్షంగా బాధ్యత. అదే సమయంలో అధికార పక్షం కూడా తాను చేస్తున్న పనులను చెప్పుకోవడం కూడా మామూలే అంశమే. దీనికి సంబంధించి పార్టీల మధ్య ఎలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగినా దానిలో ఎవరికీ అభ్యంతరం లేదు . కానీ ఇప్పుడు తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలను పక్కకు వదిలి వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. అంతటితో ఆగక కనీసం సభ్య సమాజంలో ఉన్నామా అన్న సంగతి మరిచి నేతలు విమర్శలకు దిగుతున్నారు. నేతల రాజకీయ రచ్చలో అసలు విషయాలు పక్కనదారినపడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. 

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదటి నుంచి కూడా రాజకీయంగా వైరి ఉంది. ఇప్పుడు ఆ రాజకీయ వైరి పార్టీల నుంచి కాస్తా నేతలకు చేరింది. ఇటీవల జరుగుతున్న పరిణమాలు చూస్తుంటే తెలంగాణలో నేతలు హద్దులు మీరుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో ఉన్నామా అన్న సంగతి మరిచి మరీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు,ప్రత్యారోపణలు ఉంటాయి. వాటికి కూడా ఒక పరిమిత ఉంటుంది. ప్రజలకు సంబంధించిన విషయం అయితే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ నేతల వ్యక్తిగత అంశాలైతేనే అందరికీ అభ్యంతరకరం. నేతల మధ్య ఉన్న వ్యక్తిగత విభేధాలతో రాజకీయాల్లో రచ్చ చేయడం సరైంది కాదనే వాదన వినపడుతుంది.

మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోయేలా రాజకీయాలు ఉంటున్నాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ,అటు బీఆర్ఎస్ ముఖ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఒక దశలో ఈ విమర్శలు తీవ్ర పెరిగి కంట్రోల్ తప్పుతున్నారు. నోటికి ఏది వస్తే అదే విమర్శించే పరిస్థితులు ఏర్పడ్డాయి..ఇలా ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దుమ్మెత్తిపోసుకోవడంలో నేతలు తమ స్థాయిని మరిచిపోతున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. 

రాజకీయాల్లో చాలా సీనియర్లుగా చెప్పుకునే నేతలు సైతం తమ పరిధిని దాటి మాట్లాడుతున్నారు..ఒక్కొక్కరు ఐదార్లు సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన నేతల భాష, వ్యవహరిస్తున్న తీరుపై కూడా రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. వీది రౌడీల్లా, గుండాల్లా నేతల ప్రవర్తన ఉందని సామాన్య ప్రజలు అనుకునేలా నేతల ప్రవర్తన ఉంటుంది. ఈ నేతలు బయటనే కాకుండా దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా బూతుపురాణానికి తెరలేపుతున్నారు. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీ మాట్లాడిన తీరు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. అంతే కాదు అది ముగిసిన కొద్ది రోజులకు హైదారబాద్ లో మరో ఘటన అందరినీ షాక్ గురి చేసింది. సీనియర్ ఎమ్మెల్యే ఐన అరికపూడి గాంధీ తన అనచరులతో కలిసి మరో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీదకు దాడికి వెళ్లే యత్నం చేశారు. ఈ ఎపిసోడ్ లో ఆ ఇద్దరి ఎమ్మెల్యేల తీరును తప్పుబడుతూ పెద్ద ఎత్తున విమర్శుల వెల్లువెత్తాయి.

ఇది మరిచిపోతున్నారనుకుంటున్న క్రమంలో తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. నిజంగా ఓ మంత్రి అందునా ఓ మహిళగా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఎవరు చేసినా అది ముమ్మాటికి తప్పే.. ఆ తప్పు చేసినవారిపై చట్టంపరంగా చర్యలు తీసుకోవాల్సిందే..మంత్రి కొండా సురేఖకు ఎవరిపైనా అనుమానాలు ఉంటే వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు కానీ ఆమె అలా చేయలేదు. ఆమె భాధలో ఉందో మరి ఏమో తెలియదు కానీ ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను టార్గెట్ చేసింది.

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి. రాజకీయంగా కొండా సురేఖ కేటీఆర్‌ పై విమర్శలు గుప్పించినా దాని ప్రభావం మాత్రం అక్కినేని నాగార్జున కుటుంబం, అలాగే నటి సమంత మీద పడింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత, నాగార్జున కుటుంబం తీవ్రంగా స్పందించింది. సురేఖ తమపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలిసో తెలియకో కొండా సురేఖ సినీ పరిశ్రమను కూడా రాజకీయాల్లోకి లాగింది.కొండా సురేఖ ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేసిందో ఇప్పుడు ఆ కామెట్స్ రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

ప్రజా జీవితంలో ఉంటున్న నాయకులకు అంతలా ఫ్రస్టేషన్ ఎందుకు వస్తుందనే విమర్శలు వినపడుతున్నాయి. రాజకీయ నేతలు ప్రజల సమస్యలను పక్కకు పెట్టి  వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. ఈ రాజకీయ దూషణ పర్వంలో మహిళా నేతలు సైతం టార్గెట్ అవుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న రాజకీయం హద్దులు దాటిపోతుంది. రాజకీయ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆ నేతల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.దాని వెనుక ఉన్నది ఎవరైనా ఆ ట్రోలింగ్ బలిఅవుతుంది మాత్రం రాజకీయ నేతలే అన్న సంగతి మాత్రం మరిచిపోతున్నారు. ప్రత్యర్థిపై ట్రోలింగ్ చేస్తున్నామని కొందరు నేతలు సంబరపడిపోతున్నారు..తీరా అది తన వరకు వచ్చే సరికి మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఇప్పుడు రాజకీయం చేస్తుంది నేతలు కాదు సోషల్ మీడియానే అన్న చర్చ కూడా ఉంది.

ఈ మధ్య కాలంలో అధికా పార్టీ నేతలు కావొచ్చు, ప్రతిపక్ష పార్టీ నేతలు కావొచ్చు నాలుకలు కోస్తాం, ఊరికించి కొడుతాం, సన్నాసులు, దద్దమ్మలు , అరేయ్ ఒరేయ్ అని నేతలు మాట్లాడుతున్న తీరు మాత్రం చాలా సర్వసాధారణం అయిపోయింది.పొట్టోడో, పొడుగోడా అంటూ బాడీ షేమింగ్ కూడా నేతలు పాల్పడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేతల తీరుపై ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఇలా అదుపుతప్పి ప్రవర్తిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. 

మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో నేతల తీరు అంతటా విమర్శలకు గురి అవుతుంది. రాజకీయ నేతలు అవసరమైన అంశాల కన్నా అనవసర విషయాలపై ఎక్కువగా స్పందిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నేతల వ్యవరిస్తున్న తీరుతో ప్రజలకు పైసా ఉపయోగం ఉండదని..వ్యక్తిగత దూషణలు పక్కకు పెట్టి ప్రజా సమస్యలపై దృష్టిపెడితే బాగుంటుందనే చర్చ జరుగుతుంది.

Also Read: Prediabetes Reversal tips: ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి, రివర్సల్ చేయగలమా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News