ఫుట్‌బాల్, టెన్నిస్ రెంటినీ చూసే క్రీడాభిమానులకు చేదు వార్త. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్, వింబుల్డన్ పురుషుల సింగిల్స్ తుదిపోరు ఒకేరోజు జరగనున్నాయి. ఒకేరోజు కావడంతో అభిమానులు ఏది చూడాలో అర్థం కాని పరిస్థితి. లండన్ కాలమాన ప్రకారం వింబుల్డన్ ఫైనల్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుండగా.. ఫుట్‌బాల్ ఫైనల్ సాయంత్రం నాలుగు గంటకు మొదలు కానుంది. దాంతో వింబుల్డన్ ఫైనల్ సమయంలో మార్పులు చేయాలని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ మీద ఒత్తిడి వచ్చినా.. నిర్వాహకులు కాదన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకే వింబుల్డన్ ఫైనల్ జరగాలనేది తమ నిర్ణయమని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ సీఈవో రిచర్డ్ లెవిస్ తెలిపారు. ఈ నేపథ్యంలో వింబుల్డన్ ఫైనల్ సమయాన్ని మారుస్తారని ఆశించిన అభిమానులకు నిరాశ కలిగించింది. ఒకవేళ సెమీస్‌లో క్రొయేషియాపై గెలిచి ఇంగ్లాండ్ ఫైనల్ చేరితే ఆ దేశ అభిమానులకు మరింత ఇబ్బందే.
సాకర్ ఇంగ్లండ్‌దే: జెఫ్ హర్ట్స్ జోస్యం
28 ఏళ్ల కిందట అల్ఫ్ రామ్సే బృందం రికార్డును సమంచేసిన ప్రస్తుత ఇంగ్లండ్ యువజట్టు సాకర్ గెలిచి తీరుతుందని 1966 హ్యాట్రిక్ హీరో జెఫ్ హర్ట్స్ ధీమా వ్యక్తం చేశారు. మరోసారి మా దేశానికి అనుకూలంగా ఫలితం రావాలని కోరుకుంటున్నా అని జెఫ్ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల తర్వాత తమజట్టు సెమీస్ చేరిన సందర్భంగా జెఫ్ మాట్లాడుతూ, యువకులు సమష్టిగా రాణిస్తూ అద్భుతాలు చేస్తున్నారని.. క్రొయేషియా మ్యాచ్‌లోనూ ఇదే జోరును కొనసాగించి మరోసారి ఫైనల్లోకి అడుగుపెడతారని ఆశిస్తున్నానన్నారు. 76 ఏళ్ల జెఫ్ అప్పట్లో పశ్చిమ జర్మనీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో సంచలనం సృష్టించాడు.