Gautam Gambhir says ODI World Cup 2023 more important than IPL 2023: ఈ ఏడాది చివర్లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023కి భారత్ అతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ వన్డే ప్రపంచకప్ గెలవగా.. అప్పటినుంచి కనీసం ఫైనల్ చేరకుండానే నిరాశపరుస్తుంది. ఇందుకోసం ఇప్పటినుంచే మంచి జట్టును తయారుచేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే మెగా టోర్నీకి ముందు వేసవిలో దాదాపు రెండున్నర నెలలపాటు ఐపీఎల్ 2023 జరగనుంది. దాంతో ఆటగాళ్లపై పని ఒత్తిడి భారం కాకుండా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేయాలని బీజేపీ ఎంపీ, భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ కంటే భారత్ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గౌతమ్ గంభీర్ అన్నారు. వన్డే ప్రపంచకప్ సన్నద్ధత కోసం కీలక ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడించకపోయినా.. ఫ్రాంచైజీలు బాధపడకూడదన్నారు. ప్లేయర్స్ ఐపీఎల్ ఆడకుంటే వచ్చే నష్టమేం లేదని గౌతీ పేర్కొన్నారు. స్పిన్‌లో గొప్ప ఆటగాళ్లు అయిన కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు వన్డే ప్రపంచకప్‌లో భారీ పాత్ర పోషిస్తారని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్, కోహ్లీ లాంటి పెద్ద ప్లేయర్స్ ఐపీఎల్ ఆడకున్నా ఏం కాదన్నారు. స్టార్ స్పోర్ట్స్ షో 'రోడ్ టు వరల్డ్ కప్ గ్లోరీ'లో గౌతీ మాట్లాడారు.
'వన్డే ప్రపంచ కప్ 2023ను దృష్టిలో పెట్టుకొని భారత భవిష్యత్తు పర్యటనల ప్రణాళిక ఉంది. ఐపీఎల్ 2023లో పాల్గొనే టాప్ ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్‌పై ఎప్పటికప్పుడు ఫ్రాంచైజీలతో కలిసి బీసీసీఐ పర్యవేక్షించాలి. 2023లో భారత క్రికెట్ ప్రధాన లక్ష్యం వన్డే ప్రపంచకప్ మాత్రమే. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇబ్బంది పడినా పర్వాలేదు. అంతిమంగా భారత జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఎవరైనా పెద్ద ప్లేయర్ ఐపీఎల్‌ను మిస్ అయితే వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే ఐపీఎల్ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. వన్డే ప్రపంచకప్ మాత్రం అలా కాదు' అని గౌతమ్ గంభీర్ అన్నారు.
'నా వరకైతే ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గడం కంటే.. వన్డే ప్రపంచకప్‌ను సాధించడం ముఖ్యం. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఉత్తమ జట్టును సిద్ధం చేయాలి. ఎవరికైనా విశ్రాంతి కావాలంటే.. టీ20 సిరీస్‌లలో ఇవ్వాలి. అంతేగానీ వన్డేల నుంచి మాత్రం ఇవ్వకూడదు. మెగా టోర్నీ బరిలోకి దిగే జట్టు సభ్యులు అన్ని మ్యాచులలో కలిసి ఆడాలి. ఇదే గత రెండు ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ చేసిన అతి పెద్ద తప్పిదం ఇదే. వేర్వేరు సిరీస్‌లకు వేర్వేరు జట్లను ప్రకటించి ఇబ్బంది పడింది. అత్యుత్తమ తుది జట్టుతో ఎన్ని మ్యాచ్‌లు ఆడింది?. ఈసారి అలా చేయకూడదు' అని గౌతీ సూచించారు.
Also Read: Hair Care Tips: బొప్పాయిని ఇలా జుట్టుకు రాసుకుంటే.. దీపికా పదుకొనె లాగా మెరిసే జుట్టు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.