Janasena Yuvashakti Meeting: మూడు ముక్కల ఆలోచనలు వైసీపీకి చాలా ఎక్కువ అని.. ఇదో మూడు ముక్కల ప్రభుత్వమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఏదైనా మాట్లాడితే దత్తపుత్రుడంటాడని.. నోటిదాకా తనకు చాలా మాటలు వస్తాయన్నారు. మూడు ముక్కల ముఖ్యమంత్రికి రణస్థలం నుంచి చెబుతున్నా.. మీ నాన్న రాజశేఖరరెడ్డినే ఎదుర్కొన్నవాడిని గుర్తు పెట్టుకో అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పంచెలూడేలా తరిమికొట్టండని పిలుపునిచ్చానని.. అది సరదాగా చెప్పలేదన్నారు. ఆ తరువాత తన మీద దాడులు.. భయపెట్టడాలు.. స్టేజీలు కూల్చేయడాలు జరిగాయన్నారు. తనను తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని.. అవన్నీ పడి వచ్చానని అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో ఆయన మాట్లాడారు.
'మాట్లాడితే మూడు పెళ్లిళ్లంటావు. ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రి.. నేను మూడుసార్లు విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆ కాయ్ రాజా కాయ్ బ్యాచ్ ఉంటుంది. ఆటీన్ రాజాలు డైమండ్ రాణీలు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి ఓ ఢంకా పలాసు సలహాదారు. ఇలాంటి సన్నాసి చేతకాని మూడుముక్కల ప్రభుత్వం. వారి ప్రతినిధులు నన్నంటుంటే నేను అన్నింటికీ తెగించిన వాడిని. నేను నా దేశం.. నా సమాజం అనుకున్నా. నేను సున్నితమైన వ్యక్తిననుకుంటున్నారేమో. నాకలాంటి భయాలు లేవు. మాట్లాడితే ప్యాకేజీ అంటారు. మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడుతా.. లేదంటే చెప్పులు తీసి కొడతానని చెప్పా ఒక్కసారి. రణస్థలం నుంచి మళ్లీ చెబుతున్నా.. నా చేతికి అందుబాటులో వచ్చి నువ్వు ప్యాకేజీ అను నేను ఏం చేస్తానో చెబుతా. మా జనసైనికుడి చెప్పు... మా వీర మహిళ చెప్పు తీసుకుని కొడతా. మీరిలాంటి వెధవ వేషాలేస్తే ఎలా అడ్డుకట్టవేయాలో కూడా నాకు తెలుసు.
పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా.. సాయంత్రం సారాయి కింద పట్టుకుపోతా.. అలాంటి ప్రభుత్వం కావాలా. నవరత్రాలన్నాడు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఆయన గారికి ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ఇష్టమంట. జైలుకి వెళ్లి వచ్చిన ఖైదీ నంబర్ 6093 కూడా నా గురించి మాట్లాడితే ఎలా..? డీజీపీ గారు మీరు సెల్యూట్ కొడుతుంది ఖైదీ నెంబర్ 6093కి, ముఖ్యమంత్రికి కాదు. నేను మీ కోసం తిట్లు తింటున్నా.. మీ బిడ్డల భవిష్యత్తు కోసం తిట్లు తింటున్నా. కోట్లాది రూపాయిల టాక్సులు కడుతున్న నన్ను డబ్బులు తీసుకున్నానని ఈ వెధవలు మాట్లాడితే ఈ సారి మీ చెప్పులతో కొట్టండి..' అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సరైన రాజు లేకపోతే సగం రాజ్యం నాశనం అవుతుందన్నారు. సలహాలు ఇచ్చేవాడు సజ్జల అయితే సంపూర్తిగా నాశనం అయిపోతుందని అన్నారు.
తాను మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని.. తాను వ్యక్తిగతంగా విమర్శించాలంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నప్పటి నుంచి సీఎం జగన్ చరిత్ర తనకు తెలుసన్నారు పవన్ కళ్యాణ్. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే చాలదు.. మీరు రోడ్ల మీదకు వచ్చి కార్మికులకు అండగా నిలబడండి. మీ గొంతును నేను ప్రధాన మంత్రి గారి దగ్గరకు, అమిత్ షా గారి దగ్గరకు తీసుకువెళ్తా. రాష్ట్రాన్ని బాగు చేయమని కోరతా. మీరు పట్టుమని పది మందిని గెలిపించి ఉంటే మీకోసం బలంగా సభల్లో పోరాడే వాడిని. ఇవ్వలేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నాను. రెండు చోట్ల ఓడిపోయినోడని డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతుంది. యువత కోసం డైమండ్ రాణితో కూడా తిట్టించుకోవడానికి సిద్ధం..' అని ఆయన అన్నారు.
Also Read: Pawan Kalyan on Alliances: పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. ఆ గ్యారెంటీ ఇస్తే పొత్తులు ఉండవట!
Also Read: Pawan Kalyan: ఆ రోజు సినిమాలు వదిలేస్తా.. తుదిశ్వాస వరకు రాజకీయాలు వదలను: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి