ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అతను అగ్రస్థానంలో నిలిచాడు. భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రెండవ ఆటగాడిగా శ్రీకాంత్ నిలిచాడు. మాడ్రన్ ర్యాంకింగ్స్‌లో సైనా నెహ్వాల్ కూడా ఎలైట్ లిస్టులో ఉంది. పురుషుల విభాగంలో చైనా ఆటగాళ్లు డామినేట్ చేసే బ్యాడ్మింటన్‌లో ఇండియన్ షట్లర్‌కు నెంబర్ వన్ ర్యాంక్ రావడం విశేషం. ఇది నిజంగా దేశానికి ఎనలేని ప్రతిష్టను తీసుకువచ్చింది. ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీకాంత్ మంచి జోరుమీదున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్‌కు 76895 పాయింట్లు రాగా, డెన్మార్క్ ఆటగాడు అలెక్సన్కు 75470 పాయింట్లు వచ్చాయి. ఇదివరకు.. సైనా నెహ్వాల్ 2015 మార్చిలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకుంది. ఇప్పటికీ నంబర్ వన్ అయిన ఏకైక ఇండియన్ ఉమన్ ప్లేయర్ సైనానే.
శ్రీకాంత్ 2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచాడు. ఈ ఘనత సాధించిన నాలుగో షట్లర్ అతడు. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ గోల్డ్ మెడల్ గెలవడంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించాడు. మలేషియా టాప్ ప్లేయర్ లీ చాంగ్ వీపై శ్రీకాంత్ గెలిచాడు. ప్రస్తుతం 76895 పాయింట్లతో ఉన్న శ్రీకాంత్.. గురువారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో అలెక్సన్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్ ర్యాంక్ అందుకున్నాడు.