Hyderabad Pub Drugs Case: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఏప్రిల్ 3 తెల్లవారుజామున పబ్‌పై పోలీసులు దాడులు చేయగా... అంతకు రెండు వారాల ముందే పబ్‌కు డ్రగ్స్ సప్లై జరిగినట్లు తెలుస్తోంది. ఇదే విషయం పోలీసులకు చేరింది. పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లో మరో పబ్ యాజమాన్యం సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పబ్‌పై దాడులు జరిపారు.
దాడుల సందర్భంగా పబ్‌లో డ్రగ్స్‌తో పాటు హాష్ ఆయిల్ సిగరెట్లు, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో హాష్ ఆయిల్ సిగరెట్లను రూ.8 వేల చొప్పున విక్రయించినట్లు గుర్తించారు. మరోవైపు, ఈ కేసులో పరారీలో ఉన్న ఏ3 అర్జున్, ఏ4 కిరణ్ రాజ్‌లను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఇద్దరు విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల కిరణ్ రాజు నుంచి పోలీసులకు ఒక ఈమెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. పబ్‌పై పోలీసులు దాడులు చేసిన సమయంలో తాను అమెరికాలో ఉన్నానని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన సోదరి ఇటీవల ప్రమాదంలో గాయపడటంతో ఆమెను చూసేందుకు వెళ్లినట్లు అందులో పేర్కొన్నాడని సమాచారం. పబ్‌లో డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని... పబ్‌లో వ్యాపార భాగస్వామిని మాత్రమేనని కిరణ్ రాజు అందులో వెల్లడించినట్లు తెలుస్తోంది.
కాగా, ఏప్రిల్ 3 తెల్లవారుజామున 3 గంటల సమయంలో పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాడుల సమయంలో దాదాపు 150 మంది యువతీ యుకులు పట్టుబడ్డారు. పబ్‌లో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో మెగా డాటర్ నిహారిక కొణిదెల, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ తదితరుల పేర్లు బయటకు రావడంతో ఈ వ్యవహారం సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో A1గా అనిల్, A2గా అభిషేక్, A3గా అర్జున్, A4గా కిరణ్ రాజ్‌లను చేర్చిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: Thippeswamy: చివరి నిమిషంలో 'తిప్పేస్వామి'కి చేజారిన పదవి.. బావమరిదికే మళ్లీ ఛాన్స్.