న్యూఢిల్లీ: వైద్య విద్య నియంత్రణకు ఏర్పాటైన భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో నూతన సంస్థ, జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ)ను నెలకొల్పడానికి ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది.
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, జాతీయ వైద్య కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన తీరుపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. బిల్లును క్షుణ్ణంగా పరిశీలించడానికి పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. స్థాయి సంఘం సిఫార్సు మేరకే బిల్లు రూపొందిందని నడ్డా చెప్పారు.
ఈ బిల్లు ప్రకారం, జాతీయ వైద్య కమిషన్ కింద నాలుగు స్వతంత్ర మండళ్లు ఏర్పాటవుతాయి. యూజీ, పీజీ విద్య, సంబంధిత వైద్య సంస్థల సమీక్ష, ప్రమాణాలు, అభ్యాసకుల రిజిస్ట్రేషన్ ను పర్యవేక్షిస్తాయని చెప్పారు. ప్రభుత్వం ఈ కమిషన్ ఛైర్మన్, సభ్యులను నామినేట్ చేస్తుంది. బోర్డు సభ్యులను కేబినెట్ సెక్రటరీ శోధన కమిటీ ఎంపిక చేస్తుంది. మండలిలో ఐదుగురు ఎన్నికైన సభ్యులు, 12 మంది ఎక్స్-ఆఫీయో సభ్యులు ఉంటారు.
ఒకే ఉమ్మడి పరీక్ష అందరికీ నిర్వహించాలని, వైద్య పట్టభద్రులు వైద్యం చేయడానికి ముందు లైసెన్సుల పొందడానికి మరో పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉందని ఒక అధికారి తెలిపారు. అదనంగా కొత్త సీట్లు కావాలన్నా లేదా పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభించాలన్నా అనుమతి పొందాల్సిన అవసరం లేదన్నారు. వైద్య విద్యా విభాగంలో పారదర్శకత తీసుకురావడమే ఈ బిల్లు యొక్క ప్రధానలక్ష్యమని అన్నారు.