MLC Elections: ఎన్నికల్లో గులాబీ పార్టీ దూరం.. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో 'రాజకీయం' కాక

BRS Party Creates Tension In MLC Elections: పదేళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయ వ్యూహం రెండు జాతీయ పార్టీలను కలవరపరుస్తున్నాయి. పోటీకి దూరమవడంతో రెండు పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకు? ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

Written by - G Shekhar | Last Updated : Feb 14, 2025, 03:19 PM IST
MLC Elections: ఎన్నికల్లో గులాబీ పార్టీ దూరం.. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో 'రాజకీయం' కాక

Telangana MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రెండు టీచర్‌, ఓ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక జరుగుతుండటంతో పక్కగా గెలవాలని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. అటు కమలం పార్టీ పెద్దలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కానీ.. గతానికి భిన్నంగా ఈసారి బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నికలు అంటేనే ఎగిరి గంతేసే గులాబీ బాస్‌.. ఈసారి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలను లైట్‌ తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి నిన్న మొన్నటి వరకు అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్‌నుంచి తప్పుకోవడం సొంత పార్టీ లీడర్లనే షాక్‌కు గురిచేస్తోంది.

Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌లో 'గూడెం' గూడుపుఠాణీ.. పటాన్‌చెరులో చెడుగుడే!

ప్రస్తుతం గులాబీ బాస్ కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కే పరిమితం అయ్యారు. ఆయన పార్టీ కార్యక్రమాలన్నీ ఫామ్‌హౌస్‌ నుంచి నడిపిస్తున్నారు. కొద్దిరోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల విషయాన్ని సొంత పార్టీ లీడర్లు పదేపదే ప్రస్తావించినా గుమ్మనంగా ఉన్నారు. సరైనా సమయంలో నిర్ణయం తీసుకుందామని నేతలకు హితబోధ చేశారు. మరోవైపు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీమంత్రి హరీశ్‌ రావు, కవిత మాత్రం పార్టీ కార్యక్రమాల్లో క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. సొంత పార్టీ లీడర్లకే కొత్త జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో సత్తా చాటే అవకాశం ఉన్నప్పటికీ, పోటీకి దూరం కావడం అనేక అనుమానాలకు తావిస్తోందని చర్చ జరుగుతోంది. అంతేకాదు గులాబీ పార్టీ  బీజేపీ పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉన్నందున గులాబీ పార్టీ తమ అభ్యర్థులను పోటీలో ఉంచడం లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

Also Read: Back To KCR: బీఆర్‌ఎస్‌ పార్టీ @ 25 ఏళ్లు.. 19న మాజీ సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం?

గత పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ కమలం పార్టీ- కారు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే బీజేపీకి గతంలో ఏనాడు లేని రీతిలో 8 సీట్లు వచ్చాయని.. బీఆర్‌ఎస్ మాత్రం గుండుసున్నాకే పరిమితం అయ్యిందని విమర్శిస్తోంది. తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వే‌ల్‌కు వచ్చిన టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్‌ అయ్యిందన్నారు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్. తెలంగాణలో పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామన్నారు. కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని. బీఆర్ఎస్‌లో కేటీఆర్ - కవిత - హరీష్ మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని విమర్శించారు. 

అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఫైట్‌ నుంచి తప్పుకోవడంతో సొంత పార్టీ లీడర్లు నారాజ్‌ అవుతున్నారట. తాము ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్నప్పటికీ.. పార్టీ హైకమాండ్ మాత్రం ఓ క్లారిటీ ఇవ్వలేదని వాపోతున్నారట. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే పార్టీకి మరింత మైలేజీ వచ్చేదని అంటున్నట్టు సమాచారం. కానీ పార్టీ నేతల ఆలోచన ఇలా ఉంటే.. హైకమాండ్ ఆలోచన మాత్రం మరోలా ఉందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన బలం లేకపోవడంతోనే పార్టీ హైకమాండ్ వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. గతంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపలేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి దిగితే.. పార్టీకి మరింత నష్టం జరుగుతుందనే భావనతోనే ఎన్నికల్లో పోటీకి దిగలేదని చెబుతున్నారు. 

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తప్పుకోవడంపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుందన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ నుంచి బీఆర్‌ఎస్‌ తప్పుకోవడంతో.. కాంగ్రెస్‌- బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ జరిగే చాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News