YS Jagan YS Vijayamma First Meet A Head Of Family Assets Row: వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం తర్వాత తొలిసారి తల్లీ కొడుకులు కలుసుకున్నారు. ఒకే వేదికగా వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ కనిపించారు. క్రిస్మస్ వేడుకల్లో ఈ తల్లీ కొడుకులు కలిసి పాల్గొన్నారు. పులివెందుల పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కొన్ని వారాల పాటు వైఎస్ కుటుంబంలో తీవ్రస్థాయిలో ఆస్తుల వివాదం నడిచిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో వారి కుటుంబ వ్యవహారం సంచలనంగా మారింది.
వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ ఒకవైపు.. వైఎస్ జగన్ ఒకవైపు ఉండి ఒక యుద్ధం మాదిరి వారి కుటుంబ వివాదం నడిచింది.
ఈ వివాదంతో వైఎస్ జగన్కు తల్లి విజయమ్మతోపాటు చెల్లెలు షర్మిల దూరమయ్యారని అందరూ భావించారు. కానీ క్రిస్మస్ వేడుకలు ఆ తల్లీ కుమారులను కలిపింది.
ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో వైఎస్ విజయమ్మ, జగన్ కలుసుకున్నారు.
తన తల్లి విజయమ్మ కనిపించగానే మొదట జగన్ వెనకాడారు. తర్వాత తల్లి వద్దకు వెళ్లి కలవగా.. విజయమ్మ జగన్ను ముద్దు చేశారు.
తల్లి తరఫు కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పలకరించారు. ఈ దృశ్యాలు వైరల్గా మారాయి.
ఈ ప్రార్థనల్లో జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. విజయమ్మకు దూరంగా భారతి కూర్చున్నారు.
తల్లీకొడుకులు కలుసుకున్నా కానీ అన్యమనస్కంగానే ఉన్నారు. గతంలో ఉన్నంత ప్రేమాప్యాయతతో జగన్, విజయమ్మ, భారతి కనిపించలేదు.
క్రిస్మస్ వేడుకల అనంతరం వైఎస్ జగన్ కుటుంబసభ్యులతో దిగిన ఫొటో వైరల్గా మారాయి. వైఎస్ విజయమ్మ, భారతి, కుమార్తెలతోపాటు ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు.