ఉక్రెయిన్ విమానాన్ని కూల్చేసింది మేమే: ఇరాన్ సంచలన ప్రకటన

ఉక్రెయిన్ విమాన ప్రమాదం ఘటనపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో గత బుధవారం ఉక్రెయిన్‌కి చెందిన ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చేసింది తామేనని ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహాని ప్రకటించారు.

Last Updated : Jan 11, 2020, 04:24 PM IST
ఉక్రెయిన్ విమానాన్ని కూల్చేసింది మేమే: ఇరాన్ సంచలన ప్రకటన

టెహ్రాన్: ఉక్రెయిన్ విమాన ప్రమాదం ఘటనపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో గత బుధవారం ఉక్రెయిన్‌కి చెందిన ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చేసింది తామేనని ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహాని ప్రకటించారు. అయితే, అది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదని.. మానవతప్పిదం వల్ల జరిగిన పొరపాటు అని స్పష్టంచేసిన ఇరాన్ అధ్యక్షుడు.. తమ తప్పిదం వల్ల నష్టపోయిన దేశ ప్రజలు, మృతుల కుటుంబాలు, ఘటనతో ముడిపడి ఉన్న దేశాలకు క్షమాపణలు చెబుతున్నట్టు ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన హాసన్ రౌహానీ.. ఈ ఘోర తప్పిదానికి బాధ్యులైన వారిపై న్యాయ విచారణ చేపట్టి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

ఈ ఘటనపై విచారం వ్యక్తంచేస్తూ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి జవద్ జరిఫ్ ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు. ఇది చాలా చింతించదగిన రోజని.. సైనిక బలగాల విచారణలో తేలిందేంటంటే.. అమెరికాతో యుద్ధపూరిత వాతావరణం నెలకొన్న ప్రస్తుత క్లిష్టపరిస్థితుల నేపథ్యంలో మానవ తప్పిదం వల్ల విమానాన్ని షూట్ చేసినట్టు నేలకూల్చినట్టు జవద్ జరిఫ్ తెలిపారు. జరిగిన పొరపాటుకు ఎంతో చింతిస్తున్నామని.. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నామని జవద్ జరిఫ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఇదిలావుంటే, విమానం కూలిపోవడానికి ఇరాన్ చర్యలే కారణమని.. అందుకు ఇరాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా, కెనడా మొదటి నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Trending News