Telangana Politics : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగాక దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఎదరుచూసిన కాంగ్రెస్ స్వప్నం నెరవేరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. దాదాపు పది నెలలుగా సీఎంగా రేవంత్ రెడ్డి పాలనా కొనసాగిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం ఐన కొత్తలో అనేక ప్రచారాలు తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నాయి. సీఎంగా రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండరని కొందరు, సీఎం రేవంత్ రెడ్డిని కొందరు సొంత పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మరి కొందరు ఇలా రకరకాలుగా ప్రచారాలు జరిగాయి.కాంగ్రెస్ కు కేవలం 64 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు . వీరిలో కొందరు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని టాక్ నడిచింది.ఈ ప్రచారాల నడుమనే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో రేవంత్ ఆద్వర్యంలో కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకుంది. ఇదే సందర్భంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.దీంతో కాంగ్రెస్ మరింత సుస్థిరంగా మారింది.
అటు తర్వాత రేవంత్ రెడ్డి కాస్తా పాలన మీద దృష్టి పెట్టారు. రుణమాఫీ, హైడ్రా, వంటి కీలక నిర్ణయాలతో పూర్తి స్థాయిలో దూకుడు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రుణమాఫీతో రేవంత్ రెడ్డి తన గ్రాఫ్ ను కొంత మేర పెంచుకున్నారని కాంగ్రెస్ లో ప్రచారం నడిచింది. రుణమాఫీ తర్వాత హైడ్రా అంటూ కొత్త నినాదాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకున్నారు. నగరంలోని చెరువులను కాపాడడమే హైడ్రా లక్ష్యం అంటూ కొత్త పంథాలో దూసుకెళ్లాడు. దీంతో తెలంగాణ రాజకీయాలను తన చుట్టే తిప్పుకున్నారు. రుణమాఫీ,హైడ్రా లాంటి వాటితో రేవంత్ రెడ్డి తన పదవిని సుస్థిరం చేసుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. ఇదే సమయంలో అటు కాంగ్రెస్ పెద్దలు కూడా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవడంతో కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు తప్పని పరిస్థితుల్లో రేవంత్ కు సపోర్ట్ గా నిలవాల్సి వచ్చింది.
రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వంలోను అటు పార్టీలోను నెమ్మదిగా పూర్తి స్థాయిలో పట్టు సాధించుకున్నారు. తాను అనుకున్నట్లుగానే తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ కు ఆమోద ముద్ర కూడా వేయించుకోగలిగారు. దీంతో రేవంత్ రెడ్డికి ఇక తిరుగులేదని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కొన్ని సంఘటనలు రాజకీయంగా రేవంత్ రెడ్డిని కొంత ఇబ్బంది పెట్టాయి. అలాంటి వాటిలో హైడ్రా ఒకటి కాగా మరొకటి ఇటీవల సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి ఘటన . ఈ రెండు ఘటనల్లో రేవంత్ రెడ్డికి కీలక మంత్రుల నుంచి సరైన మద్దతు లభించేలేదని కాంగ్రెస్ లోనే చర్చ జరిగింది. ప్రతిపక్షాలు ఒకవైపు ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతుంటే సొంత పార్టీ కీలక నేతలు మాత్రం సరిగ్గా స్పందించలేదని గాంధీ భవన్ లోనే గుసగుసలు వినిపించాయి.
ఇలాంటి తరుణంలో ఇద్దరు బీజేపీ ముఖ్య నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించడానికి కొందరు కాంగ్రెస్ నేతలే కుట్ర చేస్తున్నారని ఆ బీజేపీ నేతలు మాట్లాడంపై ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.కాంగ్రెస్ లోని కొందరు నేతలు సీఎం పదవి కోసం గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఎందుకు ఇలా మాట్లాడి ఉంటారు అని ఇటు మీడియా అటు పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ జరిగింది.
ఇది ఇలా ఉండగానే మరో ముఖ్య నేత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించడానికి మత్తకల్లోలాలు సృష్టిస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ లో సీఎంలను దించడానికి ఇలాంటివి చేసిన చరిత్ర ఉందని గతంలో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి లను దించడానికి మతకల్లోల్లాలు సృష్టించారని ఈటెల రాజేందర్ కామెంట్ చేశారు. ఇలా ఇద్దరు బీజేపీ ముఖ్య నేతలు ఇలా వారం రోజుల వ్యవధిలోనే ఇలా మాట్లాడడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ జరుగుతుంది.
ప్రతిపక్షాలు చేస్తున్న ఎటాక్ నుంచి సీఎం రేవంత్ ను డిఫెండ్ చేయాల్సిన మంత్రులు కీలక సమయాల్లో సైలెంట్ గా ఉంటున్నారని ఆరోపణలు ఒకవైపు సీఎం రేవంత్ ను దించడానికి కాంగ్రెస్ లోనే కొందరు నేతలు కుట్ర చేస్తున్నారని బీజేపీ నేతలు మాట్లాడం మరోవైపు ఇలా రెండు రకాల ప్రచారాలు ఒకే సారి జరగడంతో ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు అంతటా విస్తృతంగా చర్చ జరుగుతుంది. బీజేపీ నేతల కామెంట్స్ పై కూడా కాంగ్రెస్ నేతలు కూడా ఎవరే ఖండించకపోవడంపై కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి పై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారన్న బీజేపీ నేతలు మర్మం ఏంటో ఆ నేతలకే తెలియాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter