Lok Sabha Elections Schedule: ఇప్పుడు దేశమంతా సార్వత్రిక ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. సమయం ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ అసలైన సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సై అంటే ఎన్నికల ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ఎప్పుడనేది ఉత్కంఠగా ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మార్చి 9వ తేదీ తర్వాత ఎన్నికల ప్రకటన ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉందని తేలింది.
Also Read: Two Board Exams: విద్యార్థులకు కేంద్రం భారీ షాక్.. ఏడాదిలో రెండు 'బోర్డు పరీక్షలు' రాయాల్సిందే..
దేశంలో లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ మేరకు ఏర్పాట్లు చకచకా చేస్తోంది. ఈ సందర్భంగా లోక్‌సభ, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా పర్యటించింది. కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసి అక్కడి ఎన్నికల సంఘానికి దిశానిర్దేశం చేస్తోంది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించి అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Sonia Assets: సోనియా గాంధీకి సొంత కారు లేదంట.. ఇక మిగతా ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..
విశ్వసనీయంగా వస్తున్న సమాచారం ప్రకారం మార్చి 9వ తేదీ తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయమై జాతీయ మీడియాలో జోరుగా ప్రసారాలు, కథనాలు వెలువడ్డాయి. సార్వత్రిక ఎన్నికలకు తోడు దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వాటి గడువు కూడా మే నెలతో ముగియనుంది. ప్రత్యేక చట్టం రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. సార్వత్రిక ఎన్నికలతోపాటే అక్కడ నిర్వహించేందుకు ఈసీ సమాలోచనలు చేస్తోంది. అక్కడి పరిస్థితులు, కేంద్ర నిర్ణయంపై ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, బలగాలపై చర్చలు చేస్తున్నారు.
జాతీయ మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం లోక్‌సభతో పాటే జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. మార్చి రెండోవారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ఆయా మీడియా సంస్థలు వెల్లడించాయి. గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10వ తేదీన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించగా.. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టారు. గతంలో మాదిరి ఈసారి కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.
కాగా ఎన్నికల ప్రకటన వెలువడే లోపు ప్రజలకు తాయిలాలు ప్రకటించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఒకేరోజు ఏపీలో, తెలంగాణలో పలు కేంద్ర సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని మోదీ చేశారు. ఇక దేశవ్యాప్తంగా ఇలాంటి పనులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జమ్మూ కశ్మీర్లో కూడా పర్యటించి అక్కడి ప్రజలకు భారీ వరాలు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు సైగ చేసిన అనంతరమే వెంటనే ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook