బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు. గడ్డి కుంభకోణం కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్... ఇటీవలే ప్రొవిజనల్ బెయిల్‌పై బయటికొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తనకి కోర్టు మంజూరు చేసిన ప్రొవిజనల్ బెయిల్ గడువు ముగియడంతో లాలూ ప్రసాద్ యాదవ్ రాంచిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోయారు. అనంతరం ఆయన్ను సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు జెయిల్‌కి తరలించారు. కోర్టు ఎదుట లొంగిపోయిన సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. తనని న్యాయస్థానం ఎక్కడ ఉంచదల్చుకుంటే అక్కడ ఉంచవచ్చునని, కోర్టు ఆదేశాలను తాను శిరసావహిస్తానని అన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ లొంగుబాటు నేపథ్యంలో ఆయన వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు లాలూ తరపు న్యాయవాది, జడ్జి ఎస్ఎస్ ప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. లాలూ తరపు న్యాయవాది అభ్యర్థనను విన్న న్యాయమూర్తి.. లాలూ ప్రసాద్ యాదవ్‌కి చికిత్స అందించాల్సిందిగా ఆయన జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటున్న బిర్సా ముండా జైలు వైద్యులకు ఆదేశాలు జారీచేశారు.