జులై 26, 2018 తేదిన మధ్యప్రదేశ్ మాండసౌర్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఇర్ఫాన్ (20), అసిఫ్ (24) అనే యువకులను పోలీసులు అరెస్టు చేశారు. గతకొంత కాలంగా అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఐపీసీ 376డీబీ ప్రకారం నిందితులకు మరణశిక్ష విధిస్తున్నట్లు స్పెషల్ జడ్జి తెలిపారు. ఈ కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ ఐపీసీ 376డీబీ కొత్త చట్టం ప్రకారం 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికపై దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు కోర్టు మరణశిక్ష విధించిందని తెలిపారు.
హఫీజ్ కాలనీ ప్రాంతంలో బాధితురాలి సొంత ఇంటిలోనే ఆమెను గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు.. ఆమెను గొంతుపిసికి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఆమె మెడభాగంతో పాటు ముఖం, తల, ఇతర అవయవాలపై గాయాలు చేశారు. ప్రస్తుతం ఆమె ఇండోర్‌లో చికిత్స పొందుతోంది. బాలికపై అత్యాచారం జరిగాక.. అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం పై విరుచుకుపడ్డాయి. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, రేపిస్టులకు ఈ భూమి మీద బ్రతికే అవకాశం ఉండకూడదని.. వారికి మరణశిక్ష విధిస్తే మంచిదని తెలిపారు.
ఇదే కేసులో నిందితుల మీద 350 పేజీల ఛార్జిషీటు నమోదు చేశారు పోలీసులు. ఈ ఛార్జిషీటులో 92 మంది సాక్షుల సంతకాలు కూడా పొందుపరిచారు. అలాగే 100 పైగా ఆధారాల వివరాలను కూడా సమర్పించారు. ఇదే కేసులో నిందితులకు కోర్టు మరణశిక్ష విధించడం జరిగింది. కాశ్మీర్‌లో కథువా ఘటన జరిగాక.. ప్రభుత్వం మీద వచ్చిన ఒత్తిడి మేరకు 376డీబీ చట్టంలో మార్పులు చేశారు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారం చేసే నిందితులకు మరణశిక్ష విధించాల్సిందేనని కొత్త చట్టంలో పేర్కొన్నారు. అందుకే ఆ చట్టప్రకారమే మాండసౌర్ అత్యాచార ఘటనలో నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది.
మాండసౌర్ ఘటనలో నిందితులకు మరణశిక్ష