ఒకే కాన్పులో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు జన్మించడం సర్వసాధారణం. చాలా వరకు ఒకరు మాత్రమే పుడితారు. ఐతే కొంత మంది మహిళలు ఇద్దరికి కూడా జన్మనిస్తారు. అలా పుట్టిన వారిని కవల పిల్లలు అంటారు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఓ అద్భుతం జరిగింది. ఒకేసారి జత కవలలు జన్మించారు. అంటే ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టారు.
ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఓ మహిళ .. ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇది చాలా అరుదుగా జరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని ఉత్తరకాశి జిల్లా బర్కాట్ కి చెందిన 24 ఏళ్ల మహిళకు తీవ్రంగా నొప్పులు రావడంతో ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్ లోని డూన్ ఆస్పత్రిలో చేరింది. ఐతే ఆమె కడుపులో నలుగురు పిల్లలు ఉన్నారని గుర్తించిన వైద్యులు .. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి పంపించారు. 34 వారాలు నిండిన గర్భవతి అయిన ఆ మహిళను ఎయిమ్స్ వైద్యులు.. పూర్తిగా పరిశీలించారు. ఆమె గర్భంలోని పిల్లలకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించి.. ముందుగానే ఇంజక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు ఆపరేషన్ నిర్వహించి నలుగురు పిల్లలను బయటకు తీశారు.
నలుగురు పిల్లల్లో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వారు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. తల్లి కూడా క్షేమంగానే ఉన్నట్లు వివరించారు. ఐతే ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనివ్వడం అతి అరుదుగా జరుగుతుందని చెప్పారు. లక్ష మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉంటుందన్నారు. గతంలో ఆ మహిళకు గర్భస్రావం అయిందని .. ఆ తర్వాత ఓవలేషన్ ఇండక్షన్ కావడం వల్ల నాలుగు పిండాలు అభివృద్ధి చెందినట్లు వైద్యులు తెలిపారు.