చెన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నారు పలువురు రాజకీయ ప్రముఖులు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తమిళసాయి సుందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ 'రజినీకాంత్ కొత్తపార్టీ 2019లో ఎన్డీయే భాగస్వామిగా ఉంటుంది' అని చెప్పారు.
"సమయం వచ్చినప్పుడు" లోక్సభ ఎన్నికలలో తాను కూడా పాల్గొంటానంటూ సూపర్ స్టార్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే బిజేపీ పార్టీ స్పందించింది. రాష్ట్ర బీజేపీ చీఫ్, రజినీకాంత్ రాజకీయాల్లో వచ్చినందుకు అభినందిస్తూ.. "బీజేపీ నినాదమైన అవినీతిరహిత సుపాలన మోటోతో రాజకీయాల్లోకి వచ్చిన నటుడు రజినీకాంత్ కు శుభాకాంక్షలు" అన్నారు. ఆదివారం రజినీకాంత్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీని ప్రారంభించబోతున్నానని చెప్పిన సంగతి తెలిసిందే..!
రాజకీయాల్లో నిజాయితీకి పెద్దపీట వేస్తూ, మంచి పాలనే లక్ష్యంగా పోరాడతానని చెప్పారు. ప్రతిదీ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. నా మోటో, కోరికను సాధించాలంటే అది నా ఒక్కడివల్ల కాదు.. మీ అందరి సహకారం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
"రాజుల కాలంలో.. వారు శత్రుదేశాలను దోచుకున్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు సొంత ప్రజలను దోచుకుంటున్నాయి. ఇటువంటి వ్యవస్థను ప్రజాస్వామ్యంగా మార్చాల్సిన అవసరం ఉంది' అని అన్నారు.
కాగా.. కమల్ తో పాటు పలువురు తమిళ సినీ నటీనటులు ఆయన రాకను స్వాగతించారు. పాలక ఎఐఎడిఎంకే పార్టీ రజినీపై ఆచితూచి స్పందించింది. టి.టి.వి.దినకరన్ కూడా మొదట ఆయన రాకపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటించాక 'సంతోషం' అన్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ రజినీకాంత్ ను అభినందించి, స్వాగతించారు.