న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని అహ్మెద్ నగర్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరి.. అక్కడే స్పృహతప్పి పడిపోయారు. రాహురిలోని మహాత్మ పూలే క్రిషి విద్యాపిఠ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కాన్వకేషన్ ఫంక్షన్లో పాల్గొన్న గడ్కరి చివరలో జాతీయ గీతాలపన సందర్భంగా అందరితోపాటు కలిసి లేచినిల్చున్నారు. అదే సమయంలో ఆయన ఉన్నట్టుండి కిందపడిపోయారు. అక్కడే ఉన్న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సహా ఆయన భద్రతా సిబ్బంది గడ్కరికి సహాయంగా నిలిచారు.
డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం తిరిగి కోలుకున్న గడ్కరి.. తాను క్షేమంగానే ఉన్నానని ట్వీట్ చేశారు. ఆక్సిజన్ అందకపోవడం వల్లే తాను స్పృహతప్పిపడిపోయానని ఏఎన్ఐతో చెప్పిన గడ్కరి.. లో షుగర్ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తన ట్వీట్లో పేర్కొన్నారు.