అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించడానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని నేడు అందరూ గుర్తిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో పలు అభిప్రాయాలను పంచుకున్నారు మోదీ. సమావేశాలు అన్ని కూడా దేశ రాజధానిలోనే ఎందుకు జరగాలి అని తనకు అనిపించిందని.. అందుకే ఈసారి ఈస్టర్న్ కౌన్సిల్ మీటింగ్‌ను సిక్కింలో నిర్వహించమని చెప్పానని మోదీ తెలిపారు.
అలాగే "నార్త్ ఈస్ట్ కౌన్సిల్ మీటింగ్‌కు వచ్చిన ఆఖరి ప్రధాని మొరార్జీదేశాయ్ మాత్రమే. ఆయన తర్వాత వచ్చిన ప్రధానులు చాలా బిజీ అయిపోయారు. కానీ నేను ఈ మీటింగ్‌కు వచ్చాను. ఎందుకంటే మీకోసమే" అని తెలిపారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో ఆయన అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండుపై ప్రశంసల వర్షం కురిపించారు.
అరుణాచల్ ప్రదేశ్ వికాసానికి ముందుగానే ప్రణాళికలు వేసి.. వాటిని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎంగా ఆయన పెమాఖండుని పేర్కొన్నారు.ఇదే సభలో మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొనే దిశగా ప్రయత్నిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతీ చోట కూడా మెడికల్ కళాశాలలు స్థాపించే దిశగా తమ ప్రభుత్వం పయనిస్తుందన్నారు.