Lal Bahadur Shastri Birth Anniversary 2022: అక్టోబర్ 2, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు, ఇతర విశేషాలతో జీ తెలుగు న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జీవితాంతం విలువలకే కట్టుబడిన జన నేత.. చేతిలో దేశ ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి వంటి అత్యున్నత పదవులు ఉన్నా.. ఎలాంటి హంగులు, ఆర్బాటాలకు పోకుండా ఊపిరి ఉన్నంత కాలం అతి సాధారణ జీవితమే గడిపిన ఒక మహా నేత ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క లాల్ బహదూర్ శాస్త్రి మాత్రమే అనే చెబుతారు మన చరిత్ర తెలిసిన పెద్దలు.
లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహనీయుల గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది కానీ ఎక్కువ కాదు. ఆయనొక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదు.. గొప్ప రాజనీతిజ్ఞుడు.. జనంలోంచి పుట్టుకొచ్చిన నాయకుడు.. పేదల పక్షపాతి.. అంతకుమించి. అవును.. లాల్ బహదూర్ శాస్త్రి గొప్పతనం గురించి వర్ణించడానికి పదాలు సరిపోవు. ఆయన మంచితనం కొలిచే సాధనమేదీ లేదు. లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడు రైట్ ప్లేస్‌కే వచ్చారనుకోవాలి.
గురు-శిష్యుల బంధంలో యాదృశ్చికంగా కలిసొచ్చిన అంశం
అక్టోబర్ 2 అంటే చాలా మందికి గుర్తుకొచ్చేది మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అనే విషయమే.. కానీ చాలామందికి తెలియని మరో విషయం ఏంటంటే మన దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా జయంతి కూడా అదే రోజున అని. గాంధీ 1969 అక్టోబర్ 2న జన్మించగా.. లాల్ బహదూర్ శాస్త్రి 1904లో జన్మించారు.
శాస్త్రి జీవితంలో స్వామి వివేకానంద, అనీ బీసెంట్ల పాత్ర
లాల్ బహదూర్ శాస్త్రికి మహాత్మా గాంధీ అంటే చాలా ఇష్టం. గాంధీ ప్రసంగం విని స్పూరణ పొందిన తర్వాతే శాస్త్రి స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. అయితే చాలా మందికి తెలియని మరో విషయం ఏంటంటే.. స్వామి వివేకానంద, అనీ బీసెంట్ వంటి ప్రముఖుల రియల్ స్టోరీలు కూడా శాస్త్రిని ఎంతో ప్రభావితం చేశాయనే సంగతి చాలా మందికి తెలియదు.
లాల్ బహదూర్ శాస్త్రికి పదవులు కొత్త కాదు
దేశ రాజకీయాల్లో ప్రధాని, హోంమంత్రి లాంటి అత్యున్నత పదవుల్లో సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రికి పదవులేమీ కొత్త కాదు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఎన్నో పదవులు దాటుకుంటూ వచ్చారు. గొప్ప గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరైన పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ స్థాపించిన లోక్ సేవక్ మండల్‌కి సైతం లాల్ బహదూర్ శాస్త్రి అధ్యక్షుడిగా పనిచేశారు.
జై జవాన్.. జై కిసాన్ నినాదం..
దేశాన్ని కాపాడుతున్న జవాన్ల గొప్పతనం, దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతల విలువను ప్రపంచానికి చాటిచెప్పేలా ' జై జవాన్.. జై కిసాన్ ' అనే నినాదానికి పిలుపునిచ్చింది లాల్ బహదూర్ శాస్త్రినే. 1965లో ఇండో-పాక్ వార్ సందర్భంగా ఆయన ఈ నినాదం ఇచ్చారు. ఆ నినాదం ఇప్పటికీ దేశం నలుమూలలా మార్మోగుతూనే ఉంది. ఇకపై కూడా ఉంటుంది. ఆ నినాదానికి ఉన్న గొప్ప అర్థం అలాంటిది.
శాస్త్రి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన ఘటన
లాల్ బహదూర్ శాస్త్రి 10వ తరగతి చదువుతున్న సమయంలోనే ఒకసారి అనుకోకుండా మహాత్మా గాంధీ, మదన్ మోహన్ మాల్వియా ముఖ్య అతిథులుగా హాజరైన ఒక స్వాతంత్ర్య సమరభేరి సభకు హాజరయ్యారంట. అక్కడ గాంధీ మహాత్ముడి ఆవేశపూరిత ప్రసంగం విన్న లాల్ బహదూర్ శాస్త్రిని ఏదో తెలియని శక్తి ఆవహించింది. ఆ సభకు హాజరవడమే లాల్ బహదూర్ శాస్త్రి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ వెంటనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో స్టూడెంట్ వాలంటీర్‌గా చేరి గాంధీ అడుగుజాడల్లో స్వాతంత్ర్యం కోసం పోరాటం మొదలుపెట్టారు.
మైనర్‌గా ఉన్నప్పుడే జైలుకు
లాల్ బహదూర్ శాస్త్రికి యుక్త వయస్సు కూడా రాకముందే బ్రిటిషర్ల పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక విప్లవ ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్లారంట. అయితే అప్పుడు శాస్త్రి వయస్సురీత్యా మైనరే కావడంతో అతడిని విడిచిపెట్టారంట. స్వాతంత్ర్యం కోసం శాస్త్రి జైలు మెట్లెక్కడం అప్పుడే మొదలైందన్నమాట.
ఆ రోజుల్లోనే మహిళలకు కండక్టర్ పోస్టింగ్స్ ఇచ్చిన మంత్రిగా పేరు
మహిళలను వంటింటికే పరిమితం చేసి సామాజికంగా వారిని నాలుగ్గోడల మధ్యే బంధించిన ఆ రోజుల్లోనే మహిళల అభ్యుదయం కోసం పాటుపడిన రాజనీతిజ్ఞుడు శాస్త్రి. రవాణ శాఖ మంత్రిగా ఉంటూ ఉత్తర్ ప్రదేశ్‌లో తొలిసారిగా మహిళలకు బస్సు కండక్టర్‌గా అవకాశం కల్పించిన నేతగా ఆయనకు పేరుంది.
కాంగ్రెస్ పార్టీకి మూడు గొప్ప విజయాలు అందించిన ఎన్నికల వ్యూహకర్త
చాలామందికి లాల్ బహదూర్ శాస్త్రి పెద్ద పెద్ద పదవులు అనుభవించారనే తెలుసు కానీ.. కాంగ్రెస్ పార్టీకి అలాంటి పెద్ద పెద్ద పదవులు వచ్చేలా, ఎన్నికల్లో గొప్ప విజయాలను అందుకునేలా వెనుకుండి నడిపించిన ఎన్నికల వ్యూహకర్త ఆయనే అనే విషయం చాలామందికి తెలియదు. 1952, 1957, 1962లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించడం వెనుక లాల్ బహదూర్ శాస్త్రి స్ట్రాటెజీలు కీలక పాత్ర పోషించాయి.
'శాస్త్రి వ్రతం'తో ఆహార కొరతను అధిగమించిన అపరమేధావి
ఆహార భద్రత కరువైన ఆ రోజుల్లో దేశ జనాభా మొత్తానికి సరిపడా ఆహారం లేకపోవడంతో ఎంతో మందికి తినడానికి తిండి లేని పరిస్థితులు దాపురించాయి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వానికి ఇదో పెద్ద సవాలుగా మారింది. ఆకలి చావులతో దేశం అల్లాడిపోకూడదని తలిచిన లాల్ బహదూర్ శాస్త్రి.. ఆహారం కొరత సమస్య తీరేవరకు రోజులో ఒక పూట ఆహారం తినడం మానేసి ఆ ఆహారం మరొకరికి చేరేలా చేద్దాం అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారట. ప్రజల కష్టం తెలిసిన మనిషిగా శాస్త్రి మీదున్న గౌరవంతో ఆయన ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో ఎంతోమంది స్వచ్ఛందంగా రోజులో ఒక పూట ఆహారం తీసుకోవడం మానేసి ప్రతీ పేదోడికి ఆహారం అందేలా, ఆహారం కొరత తీరేలా చేశారని చెబుతుంటారు. అంతేకాకుండా జనం స్వచ్చందంగా చేసిన ఈ ఉపవాస వ్రతాన్ని జనం ముద్దుగా శాస్త్రి వ్రత్ అని పిలిచేవారట. అంటే 'శాస్త్రి వ్రతం' అని అర్థం అన్నమాట.
అందుకే శ్వేత విప్లవం, హరిత విప్లవం లాంటి ఉద్యమాలకు ప్రోత్సాహం
ఆకలి బాధలు తెలిసిన మనిషిగా ఆహార భద్రత పెంపొందించే క్రమంలో పాల ఉత్పత్తి పెరిగేలా శ్వేత విప్లవం, వ్యవసాయం అభివృద్ధి చెందేలా హరిత విప్లవం లాంటి ఉద్యమాలను ప్రోత్సహించడంలోనూ లాల్ బహదూర్ శాస్త్రి తన వంతు కృషి చేశారు.
భవిష్యత్ తరాలకు, రాబోయే ప్రధానులకు ఆయనొక మార్గదర్శి
దేశ ప్రధాని అంటే ఎలా ఉండాలి అని ఆరోజుల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో చాటిచెప్పిన ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రికి మంచి పేరుంది. మరీ ముఖ్యంగా స్వతంత్ర్య భారతంలో పేదరికం నిర్మూలన కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది. ప్రజల మధ్యలోంచి వచ్చిన నాయకుడిగా, ప్రజల కష్టం తెలిసిన మనిషిగా అహర్నిశలు వారి అభ్యున్నతి కోసమే పాటుపడిన నిస్వార్థ జీవి లాల్ బహదూర్ శాస్త్రి. అందుకే పేదల పక్షపాతిగా చిరకాలం జనం గుండెల్లో గుర్తుండిపోయేలా చెరగని ముద్ర వేసుకున్న ఆ జన నేత మన లాల్ బహదూర్ శాస్త్రికి జీ తెలుగు న్యూస్ సెల్యూట్ చేస్తూ ప్రత్యేక నివాళి అర్పిస్తోంది.
Also Read : Lal Bahadur Shastri Jayanti 2022: లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.. ఇండో-పాక్ వార్ హీరోకి నివాళి అర్పిస్తూ..
Also Read : Gandhi Jayanti 2022: గాంధీ జయంతి చరిత్ర, ప్రాముఖ్యత, ప్రపంచ అహింసా దినోత్సవం నేపథ్యం
Also Read : YSR Jayanthi 2022: వైఎస్ఆర్ జయంతి.. వైఎస్ఆర్కి ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ? వైయస్ఆర్ డెత్ మిస్టరీ ఏంటి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి