"పాక్ ప్రభుత్వం కుల్భూషణ్ జాదవ్ ను కలవడానికి ఆయన తల్లి, భార్యకు అనుమతినిచ్చింది. సోమవారం రోజు వారిద్దరూ అతన్ని కలుస్తారు" అని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ అన్నారు.
చాలా రోజుల తరువాత జాదవ్ తల్లి, భార్య ఆయన్ను కలుస్తున్నారు. ఇద్దరు మహిళలు సోమవారం పాకిస్థాన్ కు వెళ్లి జాదవ్ ను కలుస్తారు. తిరిగి అదే రోజు సాయంత్రం భారత్ కు వస్తారు. ఇస్లామాబాద్ లో భారత డిప్యూటీ హై కమిషనర్ జె.పి.సింగ్, ఒకరు లేదా ఇద్దరు విదేశాంగ అధికారులు వారికి తోడుగా ఉంటారు అని స్థానిక వార్తాపత్రికల్లో వెల్లడించారు.
జాదవ్ తో తల్లి, భార్య 15 నిమిషాల నుంచి గంట వరకు మాట్లాడుతారు. ఇద్దరు మహిళలు మీడియాతో కూడా మాట్లాడేందుకు అనుమతిస్తారు అని స్థానిక పత్రిక ఒక కథనం వెల్లడించింది.
డిసెంబరు 20 న, పాకిస్తాన్ మానవతా దృక్పథంతో జాదవ్ ను కలవడానికి తల్లి, భార్యకు వీసా జారీ చేసిన సంగతి తెలిసిందే..! జాదవ్ కుటుంబం గత వారం వీసాల కోసం దరఖాస్తు చేసుకుంది. డిసెంబర్ నెల ప్రారంభంలో పాకిస్తాన్, జాదవ్ ను కలవడానికి కుటుంబసభ్యులకు వీలు కల్పించేందుకు అంగీకరించింది. వారి భద్రత, రక్షణ, స్వేచ్చకు కూడా హామీ ఇచ్చింది.