మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. కమల్ నాథ్ సర్కారును సుడిగుండలో పడేస్తూ . . గ్వాలియర్ రాజవంశంలో మూడో తరం వారసుడు.. కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు.
జాతీయ పార్టీ కాంగ్రెస్ పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన జ్యోతిరాదిత్య సింధియా.. అనుకున్న పని పూర్తి చేశారు. ఏకంగా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు అన్ని పదవులను వదులుకుంటున్నట్లు రాజీనామా లేఖాస్త్రాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి సంధించారు. తన రాజీనామా పత్రాన్ని తన ఆఫీసులో సిబ్బందితో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంతోపాటు. . తాత్కాలిక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి పంపించారు. దీంతో ఆయన 18 ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్ తో అనుబంధాన్ని తెంచుకున్నట్లయింది.
అంతకుముందు బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఇంటికి వెళ్లారు జ్యోతిరాదిత్య సింధియా. ప్రధానితో పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రధానితో జ్యోతిరాదిత్య భేటీ ముగిసే లోగానే.. ఆయన రాజీనామా పత్రాలు సోనియా గాంధీ నివాసానికి చేరడం విశేషం.
Read Also: ఉత్సాహంగా కిరణ్ బేడీ హోలీ
మరోవైపు జ్యోతిరాదిత్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన హోలీ సందర్భంగా సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు.