Deve Gowda Arrives in Chopper To cast His Vote: కర్ణాటక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాజీ ప్రధాని హెచ్ డి. దేవేగౌడ హెలీక్యాప్టర్ లో తన సొంతూరికి చేరుకున్నారు. దేవేగౌడ తన భార్య చన్నమ్మతో కలిసి హాసన్ జిల్లాలోని హోలెననర్సిపూర్ పట్టణం సమీపంలో ఉన్న పడువలహిప్పె గ్రామానికి వచ్చారు. హోలెననర్సిపూర్ గవర్నమెంట్ కాలేజ్ ఆవరణలో ఉన్న హెలీప్యాడ్ వరకు హెలీక్యాప్టర్ లో వచ్చిన ప్రధాని దేవేగౌడ.. అక్కడి నుంచి కారులో పడువలహిప్పె గ్రామానికి వెళ్లారు.
హెచ్డి దేవేగౌడ 89 ఏళ్ల వయస్సులోనూ ఎన్నికలకు ముందు వరకు చురుకుగా జనతా దళ్ సెక్యులర్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ రాష్ట్రం నలుమూలలా జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన కుమారుడు కుమార స్వామికి మరోసారి పూర్తి మెజార్టీతో అధికారం కట్టబెట్టాల్సిందిగా కర్ణాటక ఓటర్లకు దేవేగౌడ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల్లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన వొక్కలిగ సామాజిక వర్గం వారిని వారి ఓటు జేడీఎస్ కి వేసేలా చూడాల్సిందిగా వేడుకున్నారు.
కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. వొక్కలిగ సామాజిక వర్గం, అలాగే లింగాయత్ సామాజిక వర్గం వారి ఓట్లు కీలకం అనే సంగతి తెలిసిందే. అందుకే బీజేపి అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా.. లేక మరో పార్టీ అయినా.. ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన మాస్ లీడర్స్ కి తమ పార్టీలో అగ్రస్థానం అప్పజెప్పి వారికి భారీ ప్రాధాన్యత ఇవ్వడం అందరం చూస్తున్నదే. అలా ఆ రెండు సామాజిక వర్గాల వారిని ప్రసన్నం చేసుకోగలిగితే.. వారి ఓట్లు తమ పార్టీకి పోల్ అయినట్టే అనేది అన్ని రాజకీయ పార్టీల అంచనాలు.
#WATCH | JD(S) chief and former Prime Minister HD Devegowda casts his vote for #KarnatakaElections2023 pic.twitter.com/6vqAY7Iwdu
— ANI (@ANI) May 10, 2023
ఇదిలావుంటే, ఇవాళ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన దేవేగౌడ.. ఇద్దరు వ్యక్తిగత సహాయకుల సహాయంతో పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేసి వచ్చారు. దేవేగౌడ హెలీక్యాప్టర్లో వచ్చి మరి ఓటు వేసిన దృశ్యాలు ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.