రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాఫెల్ విమానాల ధర గత యూపీఏ ప్రభుత్వం అంగీకరించిన ధర కంటే 9 శాతం తక్కువని సీతారామన్ వెల్లడించారు. ‘కాంగ్రెస్ హయాంలో కంటే 9 శాతం తక్కువకే ఒప్పందం చేసుకున్నాం. అయినా ఆరోపణలు చేస్తున్నారు.' అని అన్నారు. ఈ విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను ఆమె తోసిపుచ్చారు.
రాఫెల్ ఒప్పందం నుండి హెచ్‌ఎఎల్‌ను తొలగించింది యూపీఏ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి వెల్లడించారు. రాఫెల్ విమానాల ఉత్పత్తి సంస్థ ఫ్రాన్స్‌కి చెందిన డస్సాల్ట్ ఏవియేషన్, హెచ్‌ఎఎల్ డీల్ నిబంధనలపై అంగీకారం కుదరకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ సంస్థను ఒప్పందం నుండి తొలగించిందని చెప్పారు. విలేకర్లతో మాట్లాడుతూ.. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరి ఎన్నికలు జరుగుతాయని, మళ్లీ అధికారంలోకి బీజేపీ పార్టీయే వస్తుందని చెప్పారు.
2016లో భారత ప్రభుత్వం, ప్రాన్స్ ప్రభుత్వంతో డస్సాల్ట్ కంపెనీకి చెందిన 36 రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
నిజాలు దాచేస్తున్నారు: ఏకే ఆంటోనీ
రాఫెల్ ఒప్పందం వివరాలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దాస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆరోపించారు. తక్కువ ధరకే డీల్ కుదిరింటే 126 బదులు 36 విమానాలను మాత్రమే ఎందుకు కొనుగోలు చేసేందుకు అంగీకరించారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేంద్రం వాస్తవాలను దాచిపెడుతోందని, వెంటనే జాయింట్ పార్లమెంటరీ దర్యాప్తు కమిటీ వేయాలని ఆంటోని డిమాండ్ చేశారు.